బొత్సకు భారీ బహుమానం
Botcha Satyanarayana: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు బొత్స సత్యనారాయణకు భారీ బహుమతి లభించింది. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా నియమితులు అయ్యారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల జరిగిన విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉదయమే ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూరకంగా కలిశారు.

ఆ కొద్దిసేపటికే- బొత్స సత్యనారాయణను శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా అపాయింట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఉన్న అపారమైన రాజకీయ అనుభవాన్ని శాసనమండలిలో వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వ్యూహాత్మక వ్యవహరించింది.
ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలంగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ వస్తోన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైంది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 11 వేలకు పైగా ఓట్ల తేడాతో టీడీపీకి చెందిన కిమిడి కళా వెంకట్రావ్ చేతిలో పరాజయం చవి చూశారు.
దీనితో ఆయనను మండలికి పంపించింది వైఎస్ఆర్సీపీ. మొన్నటి శాసన మండలి ఉప ఎన్నికలో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా గెలిచిన విషయం తెలిసిందే. టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో బొత్స ఎన్నిక లాంఛనప్రాయమైంది.
ఈ ఎన్నికల్లో మొత్తం 838 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓట్లు ఉండగా.. వైఎస్ఆర్సీపీకి 538 సభ్యలు బలం ఉంది. ఎలాగూ ఓటమి తప్పదనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ఎలాంటి ఆసక్తి చూపలేదు తెలుగుదేశం పార్టీ.
ప్రస్తుతం- వైఎస్ఆర్సీపీకే చెందిన లేళ్ల అప్పిరెడ్డి.. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తోన్నారు. బొత్స సత్యనారాయణతో పోల్చుకుంటే ఆయనకు ఉన్న అనుభవం తక్కువే. చట్టసభకు ఎన్నిక కావడం కూడా తొలిసారే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బొత్సను ప్రతిపక్ష నేతగా నియమించింది.












Click it and Unblock the Notifications