విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పై టీడీపీ తాజా నిర్ణయం..!!
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్సా సత్యానారాయణ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ కూటమి నుంచి ఇంకా పోటీ పైన సందిగ్ధత కొనసాగుతోంది. కూటమి నేతల్లోనే పోటీ పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబు వద్ద సమీక్ష జరిగినా తుది నిర్ణయం తీసుకోలేదు. అటు వైసీపీ తమ ఓటర్లతో బెంగళూరులో క్యాంపు ఏర్పాటు చేసారు. ఈ రోజు విశాఖ ఎన్నిక పైన కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.
బొత్సా నామినేషన్
అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడు విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజార్టీ ఓట్లు ఉన్నాయి. కూటమికి ఉన్న ఓట్ల సంఖ్య గెలిచేందుకు సరిపోదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లతో పాటుగా పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమికి మద్దతుగా నిలిచారు. తమ గెలుపుకు అవసరమైన ఓటర్ల మద్దతు కడగట్టగలుగుతామని కొందరు కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వద్ద ఈ లెక్కల పైన చర్చ జరిగింది.

కూటమి నేతల కసరత్తు
అటు వైసీపీ అభ్యర్దిగా బొత్సాను ఖరారు చేసిన తరువాత బెంగళూరు కేంద్రంగా క్యాంపు ఏర్పాటు చేసారు. జిల్లా నేతలతో జగన్ వరుస సమావేశాలు ఏర్పాటు చేసారు. ఓటర్లను కాపాడుకుంటే గెలుపు తమదేనని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం 839 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి దాదాపుగా 600 ఓట్ల వరకు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీకి 200 పైగా ఓట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. టీడీపీ కూటమి నుంచి పీలా గోవిందు పేరు ఖరారైందనే ప్రచారం సాగినా ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు.

టీడీపీ నేడు నిర్ణయం
టీడీపీ కూటమి నుంచి గండి బాబ్జీ పేరు పైన చర్చ జరిగింది. తాజాగా భైరా దిలీప్ పేరు రేసులోకి వచ్చింది. టీడీపీ పోటీ చేయాలనే తుది నిర్ణయానికి వస్తే దిలీప్ పేరు ఈ సాయంత్రంగా లోగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం. ఏ పార్టీ గెలవాలన్నా 450 ఓట్లు అవసరం. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. వైసీపీ ఇప్పటికే క్యాంపు ఏర్పాటు చేయటంతో ఆ పార్టీకి చెందిన ఓటర్లు ఏ స్థాయిలో కూటమి వైపు నిలుస్తారనేది కీలకంగా మారుతోంది. అటు బొత్సా పూర్తిగా ఓటర్లతో మంతనాలు కొనసాగిస్తున్నారు. దీంతో..నేడు చోటు చేసుకొనే పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం పైన స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications