సాగర్‌లో దూకి ఆత్మహత్య:పోలీసుల నిర్లక్ష్యమేనని నోట్
గుంటూరు: జిల్లాలోని సాగర్ కొత్తవంతెన వద్ద బీటెక్ విద్యార్ధిని అనుమానాస్పద స్ధితిలో మృతిచెందింది. విద్యార్ధిని హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతురాలిని హైదరాబాద్‌లోని చంపాపేటకు చెందిన అనూషా రెడ్డిగా గుర్తించారు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సూసైడ్ నోట్ రాసింది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనూష రెడ్డి కుటుంబంతో సహా హైదరాబాద్‌లోని చైతన్యపురిలో నివాసం ఉంటుంది.

ఎల్‌బీ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గుంటి రాజేష్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా అనూషను పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే రాజేష్ మరో ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అనూష రెడ్డి అతన్ని దూరం పెట్టింది.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27న గుంటి రాజేష్ తన స్నేహితుల సహకారంతో అనూష రెడ్డిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఢిల్లీ, గోవా, మధ్యప్రదేశ్, లుథియానా, కేరళ తదితర ప్రాంతాల్లో తిప్పుతూ పలుమార్లు అనూష రెడ్డిపై అత్యాచారం చేశాడు. కేరళకు వచ్చిన సమయంలో ఎలాగొలాగో రాజేష్ నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు వచ్చింది.
జరిగిన విషయాన్ని మార్చి 14న అనూష చైతన్యపురిలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని తేలికగా తీసుకున్న పోలీసులు రేప్ కేసు పెట్టి ఊరుకున్నారు. నిర్భయ చట్టం కింద రేపు కేసు పెట్టకపోవడంతో మనస్ధాపానికి గురైన అనూష గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.
తన మృతికి కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని సూసైట్‌నోటులో పేర్కొంది. దీంతో పోలీసుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications