పవన్‌కల్యాణ్ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దగ్గర మొత్తం ఐదు శాఖలున్నాయి. మంత్రివర్గాన్ని రూపొందించగానే ముందుగా పట్టుబట్టి పౌరసరఫరాలశాఖను తీసుకున్నారు. దానికి మంత్రిగా జనసేనలో నెంబర్ టూగా చెలామణి అవుతున్న తన స్నేహితుడు నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. వెంటనే పౌరసరఫరాలశాఖలో అసలు ఏం జరుగుతోంది? ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది? అనే విషయాలను తెలుసుకోవడంపై ఆయన దృష్టిసారించారు. మొత్తం ఒక స్పష్టత వచ్చిన తర్వాత కాకినాడలో విస్త్రత తనిఖీలు చేపట్టారు. అయితే అప్పటికే వైసీపీ ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న అధికారులు, ఉద్యోగులు ఉండటంతో వారి బదిలీలు జరిగాయి.
ద్వారంపూడి వ్యవహారాలపై పవన్ అధ్యయనం
ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ ఒకటికి రెండుసార్లు కాకినాడ పర్యటించి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి కాబట్టి కార్యక్రమాల్లో భాగంగా ఆయన వచ్చివెళ్లారని అందరూ భావించారు. కానీ పవన్ వచ్చిన ఉద్దేశం వేరు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్యకలాపాలు, వ్యాపార వ్యవహారాలపై కూపీ లాగి అన్ని వివరాలను సేకరించి దగ్గర పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితమే కాకినాడ జిల్లా కరప మండలంలోని గురజానపల్లిలో ద్వారంపూడికి చెందిన రొయ్యలను శుద్ధి చేసే కంపెనీని ప్రభుత్వం మూసేసింది. తాజాగా ప్రత్తిపాడు మండలం లంపకలోవ దగ్గర ఉన్న వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ పేరుతో ఉన్న మరో కంపెనీని కూడా మూసేసింది. నియయ, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడంలేదని ఒకటికి రెండుసార్లు ప్రభుత్వం నోటీసులు జారీచేసినప్పటికీ ఈ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అంతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్
ఈ సంఘటనలు జరగడానికి ముందు, ఎన్నికలు జరగడానికి ముందు పవన్ కల్యాణ్ కాకినాడలో వారాహి యాత్రను నిర్వహించారు. ఆ సందర్భంగా ద్వారంపూడిపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని వెలికితీసి నడిరోడ్డుపై నిలబెట్టకపోతే నాపేరు పవన్ కల్యాణ్ కాదు అని ప్రతిజ్ఞ చేశారు. అయితే ద్వారంపూడి స్పందించి ముందు నువ్వు గెలిచి చూపించు అంటూ సెటైర్ వేశారు. తర్వాత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన 100 శాతం విజయాలను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసిన 21 స్థానాల్లోను గెలుపొందింది.
తన గొయ్యి తానే తవ్వుకున్న ద్వారంపూడి
ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన వ్యాపారాలన్నీ బద్ధలవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బియ్యం మిల్లుల్లో విస్త్రత తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. కాకినాడు పోర్టు ప్రయివేటు పోర్టు కావడంతో ఇక్కడి నుంచి యథేచ్ఛగా గత ఐదు సంవత్సరాల్లో రేషన్ బియ్యం ఎగుమతులు అక్రమంగాజరిగాయి. ప్రస్తుతం వాటిపై కొరడా ఝుళిపించారు. స్టెల్లా నౌకలో అక్రమంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నౌకపై కేసు నమోదు చేయబోతున్నారు. అయితే ఇవేవీ ఆషామాషీగా జరగలేదు. కొంతకాలంగా పవన్ కల్యాణ్ ద్వారంపూడికి చెందిన వ్యాపారాలు, అక్రమాలు, ఐదేళ్లలో చేసిన పనులపై పూర్తిగా అధ్యయనం చేశారు. వాటిని ఆధారంగా చేసుకొని పక్కాగా రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ అంటే చాలా తేలికగా తీసుకున్నారని, ఆయన్ను రెచ్చగొట్టి తన గొయ్యిని తాను తవ్వుకునేలా ద్వారంపూడి చేసుకున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.












Click it and Unblock the Notifications