అందుకే కౌలు రైతునయ్యా .. వ్యవసాయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యవసాయంలో యువత భాగస్వామ్యం పెరగాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంలో చిన్న కమతాలు ఎక్కువగా ఉన్నాయని, రైతుల కోసం క్లస్టర్లు ఏర్పాటు కావాలని అప్పుడే సాగు లాభసాటిగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కొంతకాలం క్రితం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో కౌలుకు 12 ఎకరాల భూమిని తీసుకొని వ్యవసాయం మొదలుపెట్టిన లక్ష్మీనారాయణ, గతంలో కూడా అనేక పర్యాయాలు వ్యవసాయం పై తనకున్న మక్కువను స్పష్టం చేశారు.సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రాజకీయాల్లో తనకు మంత్రిగా అవకాశం వస్తే వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేస్తానని గతంలో ఆయన స్పష్టం చేశారు.వ్యవసాయ దారుల కష్టాలను తెలుసుకోవడం కోసం, సాగుదారులు కష్టాలు అనుభవపూర్వకంగా తెలుసుకొనే ఉద్దేశంతో కౌలు రైతుగా మారాను అని చెప్పారు.

ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి తన వ్యవసాయ భూమిలో దుక్కి దున్నిన లక్ష్మీనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జెడి ఫౌండేషన్ రైతు నాయకుడు సత్తి బాబు ఆధ్వర్యంలో రైతు పూజోత్సవం కూడా నిర్వహించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కొనియాడారు. 30మంది అన్నదాతలను ఘనంగా సన్మానించారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నలభై తొమ్మిది చోట్ల కార్యక్రమాలను నిర్వహించామని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. వ్యవసాయం చేస్తున్న తన అనుభవాలతో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సూచనలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. స్థానికులు రైతు గా మారడం వెనుక రైతులు సాధకబాధకాలు తెలుసుకోవడమే ప్రధాన ఉద్దేశమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications