11 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు
గుంటూరు: గుంటూరు జిల్లాలో మొదట విడతగా 11 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సీసీఐ మరియూ మార్కెటింగ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్ళు బుధవారం నుంచి ప్రారంభమైయ్యాయి. గుంటూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, క్రోసూరు, పొన్నూరు, తాడికొండ, ఫిరంగిపురం, నర్సారావుపేట, దాచేపల్లి, పిడుగురాళ్ళ, మాచర్ల మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు నిర్వహించేందకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కొనుగోళ్లలో గత ఏడాది జరిగిన అక్రమాలను దృష్టిలో పెట్టుకుని అటువంటి తప్పులు దొర్లకుండా పారదర్శకంగా క్రయవిక్రయాలు నిర్వహించేందుకు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఈ దఫా ముందస్తుగానే కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది కనీస గిట్టుబాటు ధర పత్తి క్వింటాకు రూ.4,160 నిర్ణయించారు. రైతుల ఆధార్, పట్టాదారు పుస్తకాలు, కౌలు రైతుల గుర్తింపు కార్డులు, బ్యాంక్ ఖాతాల నకలు కాపీలను వ్యవసాయ, రెవెన్యు శాఖ వెబ్ యాడ్లో అనుసంధానం చేశారు. దళారుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పత్తి కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. గతేడాది రైతులకు నగదు చెల్లింపులో బాగా జాప్యం జరిగింది. దళారుల ప్రమేయాన్ని కట్టడి చేయడంతో పాటు రైతులు పత్తి విక్రయించిన 48 గంటల్లోనే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమయ్యేలా మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications