ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు..!!
కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యత పెంచింది. రైల్వే బడ్జెట్ లో కేటాయింపులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోడి ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లో వీటిని చేపట్టనున్నారు.
కొత్త రైల్వే లైన్
కొత్త ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన కొత్తలైన్‌ను నిర్మించనున్నారు. ఇది సాకారమయ్యాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగనుంది. మహానది కోల్‌ఫీల్డ్ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా సులభమవుతుంది. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం అవుతుంది.

అందుబాటులోకి ఇలా
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల సామాజిక, ఆర్థికాభివఅద్ధికి ఈ మార్గం దోహదం చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్లడానికి కొత్త మార్గం అందుబాటులోకి వస్తుంది. దక్షిణ ఒడిశా, బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణాదికి 124 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ రైలు మార్గం నిర్మాణానికి 1,697 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుంది. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తాయి.

అనుసంధానం
మొత్తం 64 కొత్త రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. 510 గ్రామాలు, 14 జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత ఏర్పడుతుంది. ఏటా 140 మిలియన్ టన్నుల సరకులను అదనంగా రవాణా చేయొచ్చు. ఐదేళ్లలోనే వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. ఈ లైన్లు అందుబాటులోకి వచ్చాక 32.20 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతోపాటు 0.87 మిలియన్ టన్నుల కర్బన ఉద్ఘారాలు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. అది 3.5 కోట్ల చెట్లు నాటడంతో సమానమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.












Click it and Unblock the Notifications