పర్యాటక స్వర్గధామం వియత్నాంలో పడవ మునక- 32 మంది భారతీయులు జలసమాధి?
వియత్నాంలో ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకులకు స్వర్గధామం ఫు కువక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో దాదాపు 32 మంది పర్యాటకులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వారందరూ గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే వియత్నాం అధికారులు రంగంలోకి దిగారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదాన్ని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఎక్స్ ఓ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. పర్యాటకుల ఆచూకీ కనుగొనడానికి స్థానిక వియత్నాం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రయాణికుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.

భారతీయ పర్యాటకుల కుటుంబ సభ్యులకు అవసరమైన తక్షణ సహాయం అందించడానికి, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని చేరవేయడానికి రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వియత్నాంలోని హో చి మిన్ సిటీలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే వియత్నాం రాజధాని హనోయ్‌లో కూడా మరో సహాయ కేంద్రాన్ని నెలకొల్పారు. బాధితుల బంధువులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను విడుదల చేశారు.
ప్రమాదానికి గురైన వారి వివరాలు, అత్యవసర సహాయం కోసం బాధితుల కుటుంబ సభ్యులు హో చి మిన్ సిటీ కంట్రోల్ రూమ్ +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414, హనోయ్ కంట్రోల్ రూమ్ +84 91 308 9165 ద్వారా తమను సంప్రదించాలని సూచించారు. పడవ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాతావరణంలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న మార్పులా లేక సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తోన్నారు.
In a tragic incident, a boat carrying several Indian tourists has capsized near Phu Quoc Island in Vietnam a few hours ago.
— India in Vietnam (@AmbHanoi) July 11, 2026
Exact details of the incident are being ascertained as search and rescue operations by local authorities are ongoing.
In order to provide information…
వియత్నాంలోని ఫు కువక్ ద్వీపం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఓ ప్రముఖ పర్యాటక కేంద్రం. ముఖ్యంగా భారత్ నుండి వియత్నాం వెళ్లే పర్యాటకులు ఈ అందమైన ద్వీపాన్ని సందర్శించడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు. స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సముద్రంలో రంగురంగుల చేపలను తిలకించడానికి టూరిస్టులు ఎగబడుతుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 135 జాతుల పగడపు చేపలు ఇక్కడే కనిపిస్తాయి.












Click it and Unblock the Notifications