ప్రియాంక కామెంట్స్ బ్యాక్ ఫైర్- IIT డైరెక్టర్ కు మద్దతుగా 215 మంది వీసీలు, మేథావులు..!
లోక్ సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్రం పేపర్ లీక్ లపై నియమించిన టాస్క్ ఫోర్స్ పై సభ్యుడైన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి కామకోటిని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)చేసిన విమర్శలు కలకలం రేపాయి. గోమూత్ర నిపుణుడిని తీసుకొచ్చి పేపర్ లీక్ టాస్క్ ఫోర్స్ లో అవకాశం ఇచ్చారంటూ ప్రియాంక చేసిన కామెంట్స్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో గోమూత్రాన్ని సమర్ధించారన్న కారణంతో కామకోటిపై ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో 215 మంది వీసీలు, మాజీ వీసీలు, విద్యావేత్తలు ఓ బహిరంగ లేఖ రాశారు.
పరీక్షల సంస్కరణలపై ఏర్పాటైన కొత్త టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడైన ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటిపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు ఒక ప్రముఖ శాస్త్రవేత్త విద్యార్హతలను కించపరుస్తున్నారని వారు ఖండించారు. ప్రియాంక వ్యాఖ్యలు తమకు నిరాశ కలిగించాయన్నారు. అది వ్యంగ్యంగా చేసినా లేదా రాజకీయ వాక్చాతుర్యంతో చేసినా, అటువంటి వర్ణన ఆందోళనలను రేకెత్తిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఒక పండితుని అభిప్రాయాలలోని సారాంశంతో మమేకం కాకుండా, కేవలం ఒక ముద్ర వేసి కొట్టిపారేయడం, ప్రతి పౌరుడు పెంపొందించుకోవాలని మన రాజ్యాంగం పిలుపునిచ్చే శాస్త్రీయ దృక్పథాన్నే దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మన శాస్త్రవేత్తలు, పండితులు , విద్యావేత్తలు ఎలాంటి తిరస్కార ముద్రలకు గురవుతామనే భయం లేకుండా బహిరంగ చర్చలో పాల్గొనగలరని తెలుసుకునే హక్కు వారికి ఉందని లేఖలో వీరు పేర్కొన్నారు. ప్రొఫెసర్ కామకోటి భారతదేశంలోని అగ్రశ్రేణి శాస్త్రీయ, సాంకేతిక సంస్థలలో ఒకదానికి అధిపతి అని, ఆయన ఐఐటి మద్రాస్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఎం.ఎస్., పిహెచ్.డి. డిగ్రీలు పొందారని వారు గుర్తుచేశారు. అలాగే 150కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారని, 50కి పైగా పరిశోధనాభివృద్ధి ప్రాజెక్టులలో పాలుపంచుకున్నారని కూడా తెలిపారు. ఒకప్పుడు అసంభవంగా భావించిన ఆలోచనలు చివరికి శాస్త్రీయ ధ్రువీకరణను పొందాయని, అయితే విస్తృతంగా ఆమోదించబడిన అనేక నమ్మకాలు తరువాత తిరస్కరణకు గురైనట్లు చరిత్ర చెబుతోందన్నారు.














Click it and Unblock the Notifications