అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. స్వయంగా ప్రకటించిన ట్రంప్
అమెరికా గడ్డపై భారతీయ పారిశ్రామిక సత్తా చాటేందుకు రంగం సిద్ధమైంది. మన దేశానికి చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ 'ఎస్సార్ గ్రూప్' (Essar Group) అమెరికా చరిత్రలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను నిర్మించబోతోంది. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ఈ భారీ ప్రాజెక్టును ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. అమెరికా తయారీ రంగ చరిత్రలోనే ఇది అతిపెద్ద మైలురాయి అని ట్రంప్ అభివర్ణించారు.
అమెరికాలో ఎస్సార్ గ్రూప్‌నకు చెందిన 'మెసాబి మెటాలిక్స్' (Mesabi Metallics) సంస్థ ఈ భారీ స్టీల్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయనుంది. అయోవా రాష్ట్రంలో రూ. 15 బిలియన్ల (మన భారత కరెన్సీలో దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు) వ్యయంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా అమెరికాలో ఎస్సార్ గ్రూప్ చేయబోయే పెట్టుబడుల విలువ ఏకంగా 18 బిలియన్ డాలర్లకు చేరుకుందని ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న ట్రంప్‌నకు ఈ సందర్భంగా మెసాబి మెటాలిక్స్ చైర్మన్ రేవంత్ రుయా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మినెసోటా నుంచి అయోవాకు... పక్కా ప్లానింగ్
ఈ ప్రాజెక్టు కేవలం ఒక ఫ్యాక్టరీకి పరిమితం కాదు. మినెసోటా రాష్ట్రంలోని తమ సొంత గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని (Iron Ore) వెలికితీసి, అక్కడి నుంచి అయోవాలోని ప్లాంట్‌కు రవాణా చేసి ఉక్కు తయారు చేస్తారు. అంటే గనుల తవ్వకం నుంచి తుది ఉక్కు ఉత్పత్తి వరకు అన్నీ ఒకే వ్యవస్థ కింద అనుసంధానించబడి ఉంటాయి. అయోవా ప్లాంట్ తొలి దశలో ఏటా 75 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయనుండగా.. ఆ తర్వాత ఇది కోటి టన్నులకు పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి ఇక్కడ ఉక్కు ఉత్పత్తి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది.
50 ఏళ్ల తర్వాత తొలిసారిగా కొత్త ఇనుప గని
ఈ ప్రాజెక్టులో మరో విశేషం ఏంటంటే.. గత 50 ఏళ్ల కాలంలో అమెరికాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న కొత్త ఇనుప ఖనిజ గని ఇదే కావడం విశేషం. మినెసోటాలోని ప్రసిద్ధ 'మెసాబి ఐరన్ రేంజ్' ప్రాంతంలో ఈ గనిని అభివృద్ధి చేస్తున్నారు. దీనికోసం ఎస్సార్ గ్రూప్ ఇప్పటికే 2.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ఈ గని ద్వారా ఏటా 75 లక్షల టన్నుల ఇనుము ఉత్పత్తి అవుతుందని, స్థానికంగా వందలాది ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
లక్షలాది ఉపాధి అవకాశాలు..
ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా అమెరికాలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించబడనున్నాయి. ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కనీసం 1,750 మందికి పర్మినెంట్ ఉద్యోగాలు దక్కనున్నాయి. కేవలం నిర్మాణ దశలోనే అయిదారు వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు వచ్చే పదేళ్లలో ఏకంగా 95 బిలియన్ డాలర్ల మేర ప్రయోజనం చేకూరుతుందని శ్వేతసౌధం అంచనా వేసింది.
ట్రంప్ టారిఫ్ వ్యూహమే అసలు కారణం?
అమెరికాలో విదేశీ దిగుమతులపై ట్రంప్ విధించిన భారీ సుంకాలే ఈ భారీ పెట్టుబడులకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దిగుమతి సుంకాలు చెల్లించడం కంటే అమెరికాలోనే స్వయంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం మేలని భావించిన ప్రపంచ దేశాల కంపెనీలు ఇప్పుడు యూఎస్ బాట పడుతున్నాయి. ట్రంప్ హయాంలో దిగుమతి అయ్యే స్టీల్‌పై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడంతో.. కంపెనీలన్నీ అమెరికా గడ్డపైనే ప్లాంట్లు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి.














Click it and Unblock the Notifications
