తెలంగాణాకు కేంద్రం భారీ వరం.. పారిశ్రామిక అభివృద్ధికి భవ్య పథకం!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అనేక పథకాలను అందిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా మరియు రైల్వే వ్యవస్థను ప్రగతి పథంలో నడిపిస్తున్న కేంద్రం, పారిశ్రామికంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి వరాలను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకంలో భాగంగా రాష్ట్రంలో నాలుగు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
ఈ నాలుగు చోట్ల ఇండస్ట్రియల్ పార్కులు
ఇక ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలో ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్కుల పురోగతిపైన ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మొదటి విడత కింద హైదరాబాద్ శివారు కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, ఘట్కేసర్ మండలం మాదారం, చౌటుప్పల్ మండలం దండు మైలారం ప్రాంతాలలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వికేంద్రీకరణ ప్లాన్
ఈ నాలుగు ఇండస్ట్రియల్ పార్కులకు సమగ్ర డి పి ఆర్ ని తయారుచేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది అని సంజయ్ జాజు వెల్లడించారు. ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో మరో 16 ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సత్వరమే సిద్ధం చెయ్యాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ పార్కుల ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు.
చక్కెర పరిశ్రమల పునరుద్దరణపై ప్లాన్
పారిశ్రామిక పార్కుల పురోగతి పైన మాత్రమే కాదు రాష్ట్రంలో చక్కెర పరిశ్రమల పునరుద్దరణతో పాటు చెరుకు పంట విస్తీర్ణం గణనీయంగా పెంచేందుకు అనువైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక పైన కూడా cs సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపైన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
చెరకు రైతులను ఆదుకునే ఆలోచన
ఇతర రాష్ట్రాలలో చెరుకు రైతులకు, చక్కెర పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అనుసరిస్తున్న విధానాలపైన అధ్యయనం చేయాలని, నివేదికలను అందజేయాలని సూచించారు. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమలను పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నట్టు తాజాగా తెలంగాణ సిఎస్ సంజయ్ జాజు తన వ్యాఖ్యలతో వ్యక్తం చేశారు. చెరుకు రైతన్నను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications