తిరుమలలో అనూహ్య రద్దీ- టీటీడీ కీలక నిర్ణయం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. ఆదివారం నాడు ఏకంగా 83,578 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,137 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 5.07 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.39 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.88 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,631 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పెరటాసి మాసం కొనసాగుతోండటం, అలాగే రాబోయే వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ గురువారం, 5వ తేదీ సోమవారం ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ప్రస్తుతం రోజుకు సుమారు 80,000 భక్తులకు స్వామివారి దర్శనం చేసుకుంటోండటం, మరో 30,000 మందికి పైగా భక్తుల దర్శనానికి 24 గంటలకు పైగా పడుతోండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
ఫలితంగా టోకెన్ రహిత సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయం మరింత పెరుగుతోందని వివరించింది. ఈ కారణంగా అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆయా తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో 30వ తేది బుధవారం, అక్టోబర్ 4వ తేది ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది.
మరోవంక.. తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి చెందిన సుమారు 200 ఏళ్ల చారిత్రక నేపథ్యం గల పుష్కరిణిని రూ.1.50 కోట్లతో పునరుద్ధరించడానికి టీటీడీ పూనుకొంది. సోమవారం ఈ పనులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, పీలేరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, టీటీడీ జేఈవో డాక్టర్ ఏ శరత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడారు. పుష్కరిణి పునరుద్ధరణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు.














Click it and Unblock the Notifications
