వెంకయ్య సంచలనం: వెనుకుంటే 'వెన్నుపోటే'.. అప్పట్లో ఎన్టీఆర్‌కు జరిగినట్లు..
'నా వెనుక ఎవరు ఉండవద్దు, ఎందుకంటే 1984లో ఎన్టీఆర్ వెనుక ఉన్నవారు ఆయన్ను వెన్నుపోటు పొడిచారు. అప్పటి నుంచి నాకు అనుమానమే. అందుకే మనం ముందుండాలి' అంటూ వెంకయ్య వ్యాఖ్యానించారు.
నెల్లూరు: వెన్నుపోటు అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దివంగత సీఎం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారన్న అపవాదు ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ప్రతిపక్షాలు, ఆయన రాజకీయ శత్రువులు పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించి ఆయన్ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తారు. రాజకీయ విరోధుల సంగతి పక్కనబడితే.. చంద్రబాబుకు సన్నిహితులైన వ్యక్తుల నుంచి సైతం 'వెన్నుపోటు' వ్యాఖ్యలు రావడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్రమంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడైన వెంకయ్యనాయుడు తాజాగా వెన్నుపోటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించినట్లు ఉండటం గమనార్హం. నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనాల ప్రారంభోత్సవం సందర్బంగా వెంకయ్య మాట్లాడారు. 'నా వెనుక ఎవరు ఉండవద్దు, ఎందుకంటే 1984లో ఎన్టీఆర్ వెనుక ఉన్నవారు ఆయన్ను వెన్నుపోటు పొడిచారు. అప్పటి నుంచి నాకు అనుమానమే. అందుకే మనం ముందుండాలి' అంటూ వెంకయ్య వ్యాఖ్యానించారు.
ఎవరైనా సరే నా ముందుంటే నేను ధైర్యంగా ఉండవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయం గురించి చెబుతూ రూ.3.25లక్షల కోట్లను ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించిందని అన్నారు. కమ్యూనిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని ఆరోపించారు. జనరల్ ఆసుపత్రితో పాటు ఎఫ్ఎం రేడియో స్టేషన్, ఇండోర్ స్టేడియంలకు కూడా వెంకయ్య శంకుస్థాపన చేశారు.












Click it and Unblock the Notifications