జగన్ సర్కార్ కు కేంద్రం ఝలక్ ? కొత్త గవర్నర్ కు కీలక ఆదేశం -రాష్ట్రంలో ఎంట్రీకి ముందే !
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుకు ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కార్ కు కేంద్రం తాజాగా మరో ఝలక్ ఇచ్చింది. ఈసారి కొత్తగా నియమించిన గవర్నర్ కు బాధ్యతలు చేపట్టకముందే కీలక ఆదేశం పంపింది.
ఏపీలో తాజాగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్ధానంలో కేంద్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించింది. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోబోతున్న వేళ గవర్నర్ మార్పుపై ఇప్పటికే రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో గవర్నర్ ఇంకా బాధ్యతలు చేపట్టకముందే కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఒకటి ఆయనకు ముందస్తుగా ఓ కీలక ఆదేశం పంపింది. అదీ జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండటంతో దీనిపై చర్చ మొదలైంది.

జగన్ సర్కార్ ఇంగ్లీష్ అమలు
జాతీయ విద్యావిధానం 2020 అమల్లో భాగంగా ఇప్పటికే యూనివర్శిటీల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఏపీలో జగన్ సర్కార్ మాత్రం ఓవైపు ఎన్ఈపీ అమలు చేస్తున్నామని చెబుతూనే మరోవైపు డిగ్రీ కోర్సుల్లో మాతృభాషను తొలగిస్తోంది. తెలుగుకు బదులు ఇంగ్లీష్ మీడియంలోనే కోర్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు డిగ్రీ కోర్సుల్ని తెలుగు కాకుండా ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహించేలా గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ప్రభుత్వం మారుతున్న కాలాన్ని బట్టి ఇంగ్లీష్ మీడియం అమలు తప్పనిసరి అంటోంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం నుంచి మాతృభాష అమలుకు ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు అందుతున్నాయి.

గవర్నర్ కు యూజీసీ ఛైర్మన్ లేఖ
ఏపీలో మాతృభాష అమలుపై జగన్ సర్కార్ వైఖరి నేపథ్యంలో యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తాజాగా గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ కు ఓ లేఖ రాశారు.ఇందులో జాతీయ విద్యావిధానం ప్రకారం యూనివర్శిటీల్లో మాతృభాష అమలుపై పలు సూచనలు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాతృభాషలోనే కోర్సుల్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఆయనకు గుర్తుచేశారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం అధికారం కలిగిన గవర్నర్ మాతృభాష అమలు విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన నజీర్ ను కోరారు.

యూజీసీ ఛైర్మన్ సూచనలివే
ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో మాతృభాష అమలుకు సంబంధించి యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ కొత్త గవర్నర్ నజీర్ కు రాసిన లేఖలో పలు కీలక అంశాలున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్యలో మాతృభాషను ప్రోత్సహించేందుకు ఇవి దోహద పడనున్నాయి. వీటిలో ముఖ్యమైనవి మూడు ఉన్నాయి. స్ధానిక భాషలో ఏయే కోర్సుల పుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులో లేవో ఓ లిస్ట్ తయారు చేయాలని ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్ ను యూజీసీ ఛైర్మన్ కోరారు. అలాగే పుస్తకాలు రాయగల, అనువాదం చేయగల ప్రతిభావంతుల్ని గుర్తించాలని కోరారు. మాతృభాషలో నాణ్యమైన పుస్తకాలు తయారు చేసే ప్రయత్నాలకు మద్దతివ్వాలని, బోధన, అభ్యసనం రెండూ మాతృభాషలో సాగేలా ప్రోత్సహించాలని కూడా యూజీసీ ఛైర్మన్ కోరారు.

ఏపీలో గవర్నర్ ఎంట్రీకి ముందే !
ఏపీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 27న బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు. ఆ లోపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే యూజీసీ ఛైర్మన్ గవర్నర్ కు మాతృభాష అమలు వంటి కీలక అంశంపై లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదీ ఏపీ ప్రభుత్వం మాతృభాష స్ధానంలో ఇంగ్లీష్ అమలుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తెలుగునే ప్రోత్సహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వమంటూ గవర్నర్ ను కోరడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఎన్నికల వేళ కొత్త గవర్నర్ నియామకం కేంద్రం ఆదేశాల అమలు కోసమేనని చర్చ జరుగుతున్న తరుణంలో యూజీసీ ఛైర్మన్ ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications