అమరావతిపై ఢిల్లీలో మారుతున్న పరిణామాలు..! పార్లమెంట్ కు కీలక బిల్లు?
ఏపీ విభజన తర్వాత 2015లో కొత్త రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ అప్పటి చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు మొదలయ్యాయి. నాలుగేళ్ల పాటు రాజధాని నిర్మాణం కొనసాగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆరునెలల్లోనే అమరావతి స్ధానంలో రాష్ట్రానికి మూడు రాజధానులు తీసుకురావాలని నిర్ణయించారు. దీని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టుల్లో కేసులతో వాస్తవరూపం దాల్చలేదు.
ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో మరోసారి కూటమి సర్కార్ ఏర్పడింది. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వం రాజధాని మార్పుకు చేసిన ప్రయత్నం వెనుక అమరావతిని రాజధానిగా నిర్ధారిస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం గెజిట్ ఇవ్వకపోవడమే కారణమని తేలింది. దీంతో ఈసారి ఎలాగైనా అమరావతి రాజధానికి గెజిట్ ఇవ్వాల్సిందేనని అక్కడి రైతులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ కేంద్రంపై ఈ మేరకు ఒత్తిడి పెంచుతోంది.

అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ముందుగా ఏపీ పునర్ విభజన చట్టాన్ని సవరించాలి. ఈ చట్టంలో అమరావతే రాజధాని అనే మాట ఎక్కడా లేదు. దీంతో ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. దీంతో పునర్ విభజన చట్టంలో మార్పులకు కేంద్ర న్యాయశాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేలోపు ఈ బిల్లును లోక్ సభ, రాజ్యసభల్లో పెట్టి ఆమోదించాల్సి ఉంది.
దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటించడానికి కేంద్రం సవరణ బిల్లును తయారు చేస్తోంది. భవిష్యత్తులో రాజధానిని మార్చడానికి జరిగే ప్రయత్నాలను నిరోధించడం ద్వారా అమరావతికి చట్టపరమైన భద్రతను అందించడం ఈ బిల్లు లక్ష్యం. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణను వేగవంతం చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. దీంతో త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రానుంది.












Click it and Unblock the Notifications