కారులో వచ్చి యజమాని సహా చాక్లెట్ల లోడు లారీ చోరీ
నెల్లూరు: మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి చెన్నైకి వెళుతున్న చాక్లెట్ లోడు లారీని రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పెరియవట్టు పెట్రోల్ బంకు వద్ద లారీ ఓనర్‌తో పాటు దుండగులు అపహరించుకొని వెళ్లిన సంఘటన మంగళవారం తెల్లవారుఝామున చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా గూడూరు డిఎస్పీ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రెండురోజుల క్రితం మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి చెన్నైకి చాక్లెట్ లోడుతో లారీ బయలుదేరింది. మంగళవారం తెల్లవారుఝామున ఒంటి గంట ప్రాంతంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తడ మండలం పెరియవట్టు పెట్రోల్ బంకు వద్దకు రాగానే స్కార్పియో కారులో వచ్చిన ఎనిమిది మంది దుండగులు లారీకి వాహనాన్ని అడ్డుపెట్టి తాము ఉమ్మడి తనిఖీ కేంద్రం అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు.

లారీ డ్రైవర్ భరత్‌సింగ్. క్లీనర్ శంకర్ పత్రాలు పట్టుకురాగానే వారిని కారులో ఎక్కించుకున్నారు. దుండగుల్లో నలుగురు లారీలోకి ఎక్కి యజమాని దినేషన్ చౌహాన్ సహా లారీని అపహరించుకుపోయారు. కాగా లారీ డ్రైవర్, క్లీనర్‌ను తమ వాహనంలో ఎక్కించుకున్న దుండగులు కళ్లకు గంతలు కట్టి, నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి కారులో ఉన్న తాళ్లతో వారిని కట్టిపడేసి వాహన పత్రాలతో వెనుదిరిగారు.
వాహనం తడ ఉమ్మడి చెక్‌పోస్టు వద్దకు రాత్రి రెండుగంటల ప్రాంతంలో రాగానే వెనుక నుంచి కారులో వచ్చిన వీరు పత్రాలు చూపించి చెక్కింగ్ అడ్డంకి అధిగమించి లారీని యజమానితో సహా అపహరించుకుపోయారు.












Click it and Unblock the Notifications