ఏపీలో ఆ జిల్లా.. మలమల
Temperature in AP: నడి వేసవి రాకముందే ఏపీలో ఎండ తీవ్రతరమౌతోంది. రోజురోజుకూ అధికమౌతోంది. అటు ఉక్కపోత జనాన్ని ఊపిరాడనివ్వకుండా చేస్తోంద. అప్పుడే రాష్ట్రంలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పుడే ఇలావుంటే ఇక ఏప్రిల్, మే నాటికి ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే దాదాపుగా అన్ని ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సర్వసాధారణమైంది. వీటికి వడగాల్పులు సైతం తోడవుతున్నాయి. వేడి గాలులు విజృంభిస్తోన్నాయి. జనాన్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి.

ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటోంది. బుధవారం నంద్యాల, కడప జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3, కడప జిల్లా అట్లూరు, ఖాజీపేటలో 41.2 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 40.7, కర్నూలు నగరంలో 40.6, అన్నమయ్య రాయచోటి జిల్లాలోని కంబాలకుంట 40.2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఆయా జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఎండ తీవ్రత రికార్డయింది. అదే స్థాయిలో వడగాల్పులు వీచాయి.
నేడు మొత్తం 59 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ హెచ్చరించింది. శ్రీకాకుళం- 15, విజయనగరం- 20, పార్వతీపురం మన్యం- 14, అల్లూరి సీతారామరాజు- 2, కాకినాడ- 3, తూర్పు గోదావరి- 5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.












Click it and Unblock the Notifications