లేక్ వ్యూ అతిథి గృహం నుంచే చంద్రబాబు పాలన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం కొంతకాలం లేక్‌వ్యూ అతిథి గృహం నుంచే పరిపాలన కొనసాగించనున్నారు. ఆయన కార్యాలయం కోసం సచివాలయంలో ఎల్ బ్లాకులోని ఎనిమిదో అంతస్థును జీఏడీ అధికారులు కేటాయించారు.
అయితే, దానికి మరమ్మతులు చేయించేందుకు రెండు నెలల సమయం పడుతుందని తెలియడంతో అప్పటివరకూ లేక్‌వ్యూ నుంచే పరిపాలన సాగించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా జీఏడీ అధికారులు లేక్‌వ్యూ అతిథి గృహాన్ని ఎంపిక చేసి తగిన హంగులు చేపట్టేందుకు దాదాపు రూ. 3 కోట్లు కేటాయించారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాటికి దాన్ని సిద్ధం చేయనున్నారు. ఎల్ బ్లాకులోని ఎనిమిదో అంతస్థులో సీఎం చాంబర్‌తో పాటు మంత్రివర్గ సమావేశం నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేయాలంటే కొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
మంత్రివర్గ సమావేశం హాలుకు బుల్లెట్‌ప్రూఫ్ చేయించడం లాంటి పనులు పూర్తి కావాలంటే రెండు నెలల సమయం అవసరమని చెప్పారు. అప్పటివరకూ క్యాంపు కార్యాలయంగా ఉండే లేక్‌వ్యూ నుంచే పాలన కొనసాగిస్తారని, సమావేశాలు కూడా అక్కడే నిర్వహించనున్నారని జీఏడీ అధికారులు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications