పొత్తులపై చంద్రబాబు - అందరూ కలిసి రావాలి : త్యాగాలకు సిద్దం : క్విట్ జగన్ - సేవ్ ఏపీ..!!
ఏపీలో 2024 ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలవనున్నారు. తాజాగా చంద్రబాబు మరోసారి ప్రతిపక్షాలకు పరోక్షంగా పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా కొత్త నినాదం ఇచ్చారు. క్విట్ జగన్ - సేవ్ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని ఆహ్వానించారు. ప్రజా ఉద్యమాలు అవసరమని చెప్పుకొచ్చారు. ఎలాంటి త్యాగానికైనా సిద్దమంటూ వ్యాఖ్యానించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు తూర్పు గోదావరి చేరుకున్నారు. ఆయన జగన్ ప్రభుత్వ నిర్ణయాలు..సీఎం పైన విరుచుకుపడుతున్నారు.

అన్ని పార్టీలు కలిసి వస్తే..ముందుంటాం
కొద్ది నెలల క్రితం కుప్పం కేంద్రంగా చంద్రబాబు జనసేన పొత్తుపైన వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత జనసేన అధినేత వపన్ కళ్యాణ్ ఇదంతా మైండ్ గేమ్ లో భాగమంటూ వ్యాఖ్యానించారు. ఇక, మాజీ మంత్రులు మాత్రం టీడీపీ - జనసేన పొత్తు ఉండాలని ఓపెన్ గానే చెబుతున్నారు. వైసీపీ ముందు నుంచి పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ కలిసి పని చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇక, ఇప్పుడు చంద్రబాబు మరోసారి అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పటం ద్వారా పరోక్షంగా పొత్తులకు సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

త్యాగాలకు సిద్దమని చెప్పటం ద్వారా
అదే సమయంలో త్యాగాలకు సిద్దమని చెప్పటంతో..పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు కీలకం కావటంతో దాని పైనే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక, బాబాయ్ ది గుండె పోటా..గొడ్డలి పోటా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగనన్న రక్త చరిత్రకు సాక్ష్యం బాబాయి హత్య అంటూ చెప్పుకొచ్చారు. నీ చెల్లి నీకెందుకు సపోర్ట్ చేయటం లేదని చంద్రబాబు సీఎం జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. అత్యాచారాలు సాధారణమని హోం మంత్రి అంటున్నారని...ఆడబిడ్డలకు రక్షణ కరువైందని ఆరోపించారు.

సీఎం జగన్ లక్ష్యంగా ముందుకు
ప్రజల కోసం తీవ్రవాదులతో పోరాడుతున్నామన్నారు. కుటుంబ సభ్యులను కూడా బజారుకి ఈడుస్తున్నారని మండిపడ్డ చంద్రబాబు.. కౌరవ సభను.. గౌరవ సభ చేసిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతామని శపథం చేసినట్టు గుర్తుచేసుకున్నారు. కేసులు పెడితే భయపడేది లేదని..మరింతగా రెచ్చిపోతామని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పనులు తమ హయాంలోనే 70 శాతం పూర్తి చేశామని చెప్పారు. పోలవరం డయాగ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి నేను కారణం అంటున్నారు.. భార్య భర్తలు విడిపోయినా నేనే కారణం అంటారు ఏమో అంటూ సెటైర్ సారు.

క్విట్ జగన్..సేవ్ ఆంధ్రప్రదేశ్
పదో తరగతి పరీక్షలు నిర్వహించని సీఎం వైఎస్ జగన్.. ఇక మూడు రాజధానులు ఎలా కడతారని ఎద్దేవా చేసారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని తగలబెడుతూ.. రాష్ట్రాన్ని నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల పైనే పోరాటం చేస్తున్నామని..వ్యక్తిగతంగా ఎవరి పైనా కోపం లేదని చెప్పారు. అయితే, అటు జనసేన అధినేత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పినా.. టీడీపీ నుంచి స్పందన లేదు. దీంతో..ఇక, 2024 ఎన్నికల పైన అడుగులు పడుతున్న సమయంలో చంద్రబాబు మరోసారి అందరూ కలిసి రావాలంటూ పిలుపునివ్వటంతో రానున్న రోజుల్లో ఎటువంటి సమీకరణాలకు కారణం అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications