రెండు నాల్కల ధోరణి: పోలవరం పూర్తి కాదనే.. కేంద్రంపై దాడికి బాబు వ్యూహం ఇలా

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu
  Polavaram Project : Chandrababu Naidu's Double Standard Revealed

  హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వర ప్రదాయిని 'పోలవరం' సాగునీటి ప్రాజెక్టు అని మూడున్నరేళ్లుగా జరుగుతున్న ప్రచారం సంగతలా కొద్దిసేపు పక్కన బెడితే.. నిర్దేశిత గడువులోగా పని పూర్తి చేయడానికి కాపర్ డ్యామ్‌ల నిర్మాణానికి చేపట్టిన టెండర్ల పనులు నిలిపేయాలని గత నెల 27వ తేదీన కేంద్రం రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. అధికార టీడీపీ, రాష్ట్ర మంత్రులు.. ఎదురు దాడికి దిగారు. మరోవైపు సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని తమకు తాముగా చెప్పలేదని మరోమారు దాటవేసేందుకు పూనుకున్నారు.

  రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ వాదనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిగా దాడి చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరి, కన్నాలక్ష్మీ నారాయణ వంటి నేతల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోతున్నాయని సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు వంటి వారు ఎదురు దాడికి దిగారు.

  తాజాగా రిటైర్మెంటైన కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్‌ లక్ష్యంగా టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. ఆయన పదవి విరమణ చేయడంతో అడ్డుగోడ తొలిగిందని అనధికార 'అధికార' దినపత్రికలో ఒక వార్తాకథనం ప్రచురితం అయ్యింది. గురువారం కేంద్రం ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవచ్చునన్న చంద్రబాబు.. శుక్రవారం మాట మార్చారు.

   ‘నర్మద' పూర్తికి ఐదు దశాబ్దాలు ఇలా

  ‘నర్మద' పూర్తికి ఐదు దశాబ్దాలు ఇలా

  వేల కోట్ల రూపాయల విలువైనదీ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకించి క్రుష్ణా డెల్టాకు నీటి మళ్లింపునకు చేపట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో ఇటీవలే జాతికి అంకితం చేసిన ‘నర్మదా ప్రాజెక్టు' నిర్మాణం పూర్తి కావడానికి ఐదు దశాబ్దాల సమయం దాటింది. 2002లో ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే నర్మదా ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. 1982కి ముందు అప్పటి ఉమ్మడి ఏపీ సర్కార్ ‘పోలవరం' ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే పనులు స్పీడందుకున్నాయి.

   2004లో వైఎస్ సీఎం అయ్యాకే పనుల్లో వేగం

  2004లో వైఎస్ సీఎం అయ్యాకే పనుల్లో వేగం

  1983 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డితోపాటు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన చంద్రబాబు.. 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ ‘పోలవరం' ప్రాజెక్టు నిర్మాణం ఊసే ఎత్తలేదు. అంతెందుకు.. 1996 - 97లో నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి సారథ్యం వహించిన అప్పటి ప్రధాని హెచ్ డీ దేవెగౌడ పదేపదే గుర్తు చేసినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సంగతే ఊసే ఎత్తలేదు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అనూహ్య పరిణామాల మధ్య బీజేపీతో పొత్తు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహకారంతో ఏపీలో అధికారంలోకి వచ్చింది టీడీపీ. దాని అధినేత చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇటీవలి కాలం వరకు ‘పోలవరం' ప్రాజెక్టు నిర్మాణం ఊసే ఎత్తలేదు.

  పోలవరం ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్టే.. కేంద్రానిదే జవాబుదారీ

  పోలవరం ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్టే.. కేంద్రానిదే జవాబుదారీ

  కానీ క్రమక్రమంగా మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పోలవరం ప్రాజెక్టుపై ‘కాపర్ డ్యామ్'ల డ్రామా ప్రారంభించారు. అదీ కూడా ప్రస్తుతం ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న ‘ట్రాన్స్‌టాయ్'తో సంబంధం లేకుండా ‘కాపర్ డ్యామ్'ల నిర్మాణానికి ప్రత్యేకంగా సబ్ కాంట్రాక్టులు ఇవ్వ సంకల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున కేంద్రం.. పూర్తిగా నిధులు భరించాల్సి ఉంటుంది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మిత్ర పక్షం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వానికి ‘పోలవరం' ప్రాజెక్టు నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇటీవల శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో నీతి ఆయోగ్ సలహా మేరకే కేంద్రం తమకు ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించిందని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే వాదించారు. వచ్చే ఏడాది లోపు పనులు పూర్తయ్యే అవకాశాలు లేక కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేందుకు సీఎం చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే పోలవరం అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.58,319.06 కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంచనా వ్యయాన్ని ఇప్పటికీ కేంద్రం ఆమోదించనే లేదు.

   కాపర్ డ్యామ్‌ల నిర్మాణం పేరిట ‘స్వాహా' ఎత్తు

  కాపర్ డ్యామ్‌ల నిర్మాణం పేరిట ‘స్వాహా' ఎత్తు

  పోలవరం ప్రాజెక్టు పరిధిలో కాంక్రీట్‌ పనులు సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు కొట్టేయాలని.. తద్వారా ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల నిధి రూపకల్పన దిశగా అధికార టీడీపీ ఎత్తు వేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో ‘కాపర్ డ్యామ్'ల నిర్మాణానికి రూ.1395.30 కోట్లతో అంతర్గత పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని ఆ తర్వాత వెబ్‌సైట్‌లో రూ.1483.23 కోట్లకు వెబ్‌సైట్‌ డాక్యుమెంట్లలో మార్చేసిన గొప్పతనం ఏపీ సర్కార్‌ది. అంచనా వ్యయం మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

   తర్వాత బీజేపీ, కేంద్రంపై నేరుగా ఇలా విమర్శలు

  తర్వాత బీజేపీ, కేంద్రంపై నేరుగా ఇలా విమర్శలు

  కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని ఆగ్రహించిన కేంద్రం.. తక్షణం టెండర్ల ప్రక్రియ నిలిపేయాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్‌ సింగ్‌ లేఖ రాశారు. తమ దోపిడీ ఎత్తుగడ బహిర్గతం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కేంద్రానికి అంటగట్టేందుకు పూనుకున్నదన్న మాటలు వినిపిస్తున్నాయి. కేంద్రం వైఖరి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు అనుకూల మీడియా ద్వారా ఒకరోజు ముందే పల్లవిని ప్రారంభించాలని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖపై అసహనం ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం చేపట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంతగా ఉడికిపోవటానికి రెండు ప్రధాన కారణాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులను కమీషన్లు రాల్చే కామధేనువులుగా పరిగణించి ఎడాపెడా అంచనా వ్యయాలను పెంచేస్తూ వస్తున్న వరుసలోనే పోలవరంలోనూ వ్యవహరిస్తున్న తీరును కేంద్రం ప్రశ్నించటం మింగుడు పడలేదు. పదేపదే 2019లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెబుతున్న చంద్రబాబుకు అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించకపోవటంతో ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేయ్యాలనే వ్యూహం పన్నిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

   కేంద్రం ఆమోదించకముందే ఇలా టెండర్లు

  కేంద్రం ఆమోదించకముందే ఇలా టెండర్లు

  పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.58,319.06 కోట్లకు పెంచుతూ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించక ముందే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి పెంచిన ధరల మేరకు పోలవరం హెడ్‌ వర్క్స్‌ పనుల్లో రూ.1395.30 కోట్ల విలువైన పనులను తాము ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు దక్కేలా 18 రోజుల స్వల్పకాలిక వ్యవధితో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. ఇది సరైన పద్ధతి కానే కాదని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్‌ సింగ్‌ గతనెల 27న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌కు లేఖ రాశారు. అత్యంత ప్రధానమైన పనులకు కనీసం 45 రోజుల వ్యవధితో కూడిన టెండర్‌ను నిర్వహిస్తే ఎక్కువ కాంట్రాక్టు సంస్థలు పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని.. తక్కువ ధరకే నాణ్యంగా, వేగంగా పనులు చేసే కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయవచ్చని సూచించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా స్వల్పకాలిక టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు చర్యకు తార్కాణమని అభివర్ణించారు. టెండర్‌ నోటిఫికేషన్‌ నవంబర్ 16న జారీ చేస్తే 22వ తేదీ వరకూ ఈ - ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయకపోవడంలో ఔచిత్యమేమిటని నిలదీశారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయటంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నిర్మాణాత్మక ప్రణాళిక ఖరారు చేసే వరకూ టెండర్‌ ప్రక్రియను నిలిపివేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో దోపిడీ ప్రయత్నాలు బట్టబయలవుతాయని పసిగట్టిన సీఎం చంద్రబాబు కేంద్రమే ప్రాజెక్టు చేపట్టాలని సరి కొత్త నాటకానికి తెరలేపారు.

   కేంద్రంతో జరిగిన సమావేశాల్లో ఏపీ ఇలా ఆత్మరక్షణ వైఖరి

  కేంద్రంతో జరిగిన సమావేశాల్లో ఏపీ ఇలా ఆత్మరక్షణ వైఖరి

  పోలవరం కాంక్రీట్‌ పనులను అనధికారికంగా సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వ పెద్దలు వేసిన పథకం కాంట్రాక్టు సంస్థలేవీ ముందుకు రాకపోవటంతో పారలేదు. ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ సబ్‌ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఎస్క్రో అకౌంట్‌ ఏర్పాటు చేసి నేరుగా బిల్లులు చెల్లిస్తేనే పనులు చేస్తామని ప్రతిపాదించాయి. ఈ క్రమంలో తాజా ధరల మేరకు కొత్తగా టెండర్లు పిలిస్తే భారీ ఎత్తున కమీషన్లు దండుకోవచ్చునని అధికార టీడీపీలో కీలక నేతలు భావించారని విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలంటే కాంక్రీట్‌ పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలనే పల్లవి అందుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అక్టోబర్‌ 13న నాగ్‌పూర్‌లో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమైన సీఎం చంద్రబాబు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనుల్లో కొంత భాగాన్ని కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగిస్తామని ప్రతిపాదించారు. దీనివల్ల పాత కాంట్రాక్టర్‌తో న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని, ‘తాజా' ధరల మేరకు టెండర్లు పిలిస్తే అంచనా వ్యయం పెరుగుతుందని గడ్కరీ అభ్యంతరం తెలిపారు. అక్టోబర్‌ 16న కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమైనప్పుడు కూడా కేంద్రం ఇదే అంశాన్ని కుండబద్ధలు కొట్టింది. అక్టోబర్‌ 25న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలోనూ ఇదే అంశాన్ని గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో చర్చించి తీసుకున్న నిర్ణయాల పత్రాలు (మినిట్స్‌)పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు కూడా చేశారు.

   జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకయ్యే ఖర్చు భరించలేమన్న కేంద్రం?

  జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకయ్యే ఖర్చు భరించలేమన్న కేంద్రం?

  రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన సీఎం చంద్రబాబు.. గత ఏడాది సెప్టెంబర్ 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో లేని ప్రత్యేక ప్యాకేజీని ఉన్నట్లు చూపుతూ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. కేంద్రం సెప్టెంబర్ 8న జారీ చేసిన ప్రకటనలో 2010-11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లనీ, ఇందులో 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకూ చేసిన రూ. 5135 కోట్లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కూడా ఇవ్వలేమని కేవలం నీటిపారుదల విభాగానికి అయ్యే ఖర్చును మాత్రమే ఇస్తామని పేర్కొంది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబుకు తెలిసినా పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2013-14 ధరల ప్రకారం రూ.58,319.06 కోట్లకు పెంచుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,205.66 కోట్లు పోనూ మిగతా రూ.54,113.40 కోట్లు ఇవ్వాలని అడుగుతున్నారు.

  ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా వ్యూహం

  ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా వ్యూహం

  కేంద్ర జలవనరుల శాఖ అక్టోబర్‌లో నిర్వహించిన మూడు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా సీఎం రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. స్పిల్‌ వేలో 35వ బ్లాక్‌ వరకూ కాంక్రీట్‌ పని, దానికి అనుబంధంగా స్టిల్లింగ్‌ బేసిన్, ఆఫ్రాన్, స్పిల్‌ వే వంతెనలో కాంక్రీట్‌ పని, స్పిల్‌ ఛానల్‌లో 356 మీటర్ల నుంచి 1540 మీటర్ల వరకూ కాంక్రీట్‌ పని, స్పిల్‌ ఛానల్‌లో 356 మీటర్ల నుంచి 2920 మీటర్ల వరకూ మట్టి తవ్వకం పనులకు రూ.1395.30 కోట్ల అంచనా వ్యయంతో 18 రోజుల స్వల్పకాలిక వ్యవధితో నవంబర్‌ 16న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. తాను ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా టెండర్‌ నిబంధనలు పొందుపరిచారు. టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశాక అంచనా వ్యయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వ పెద్దలు అది మరింత పెంచాలని ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఒకసారి అంతర్గత అంచనా విలువను నిర్ణయించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశాక ఇక అంచనా వ్యయాన్ని పెంచలేమని ఉన్నతాధికారులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.

   గత నెల 27వ తేదీ వరకు వేచి చూసిన కేంద్ర జల వనరుల శాఖ

  గత నెల 27వ తేదీ వరకు వేచి చూసిన కేంద్ర జల వనరుల శాఖ

  పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్, తదితర కాంక్రీట్ పనులు చేపట్టేందుకు టెండర్‌ ప్రకారం డిసెంబర్‌ 4వ తేదీన సాయంత్రం నాలుగు గంటల్లోగా షెడ్యూళ్లను దాఖలు చేయాలి. కానీ అంచనా వ్యయం పెంచడంపై వివాదం రేగడంతో నవంబర్‌ 29 వరకూ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో టెండర్‌ పత్రాలను అప్‌లోడ్‌ చేయలేదు. కేంద్రం కళ్లకు గంతలు కట్టి కొంత భాగం పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించి భారీ ఎత్తున కమీషన్‌ను దండుకోవడానికి పావులు కదుపుతూ వచ్చారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌లో కొంత భాగం పనులకు పోలవరం ప్రాజెక్టు ఈఎన్‌సీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారని ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ నవంబర్‌ 18న కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం తెలుసుకున్న కేంద్ర జలవనరుల శాఖ నవంబరు 27 వరకూ వేచి చూసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం రాదనే నిర్ణయానికి వచ్చిన కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్‌సింగ్‌ అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర జలవనరుల శాఖకు కనీస సమాచారం ఇవ్వకుండా.. అనాలోచితంగా జారీ చేసిన టెండర్‌ను నిలిపేయాలని ఆ లేఖలో స్పష్టం చేశారు.

   కేంద్రం అనాలోచిత విధాన నిర్ణయాలతోనని ప్రతి విమర్శలు

  కేంద్రం అనాలోచిత విధాన నిర్ణయాలతోనని ప్రతి విమర్శలు

  కేంద్ర జలవనరులశాఖ లేఖతో గుట్టుగా సాగిస్తున్న దోపిడీ వ్యూహం బట్టబయలవడంతో సీఎం చంద్రబాబు సరి కొత్త నాటకానికి తెరతీశారు. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేయలేమనే నిర్ణయానికి వచ్చి ఆ వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టేందుకు వ్యూహం రచించారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్డుపడుతోందంటూ అనుకూల మీడియా ద్వారా ఎదురు దాడికి దిగారు. పోలవరం పనులను ట్రాన్స్‌ట్రాయ్‌తోపాటూ సబ్‌ కాంట్రాక్టు సంస్థలు ఎల్‌ అండ్‌ టీ, బావర్, కెల్లర్, బీకెమ్, ఫూట్జ్‌మీస్టర్, పెంటా సంస్థలు చేస్తున్నాయనే వాస్తవాన్ని విస్మరించి కొత్తగా పిలిచిన టెండర్లను నిలిపివేస్తే ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే ఆగిపోతాయనే వాదన ప్రారంభించారు. మూడు రోజుల్లో పదవీ విరమణ చేసే కేంద్ర అధికారి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని.. ఇప్పటికే చేసిన పనులకు రూ.3 వేల కోట్లకుపైగా బకాయి పడిందని చెప్పారు.

   స్పిల్ వే, స్పిల్ చానల్ నిర్మాణ పనులకు ఇలా టెండర్లు

  స్పిల్ వే, స్పిల్ చానల్ నిర్మాణ పనులకు ఇలా టెండర్లు

  రాష్ట్ర ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు తమ అక్రమార్జనకు అక్షయపాత్రగా మార్చుకున్నారనడానికి తార్కాణం ఇది... పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌లో కొంత భాగం కాంక్రీట్, మట్టి పనులు తాను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే దక్కేలా నిబంధనలు రూపొందించి నవంబర్‌ 16న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. అప్పట్లో పనుల అంతర్గత అంచనా వ్యయాన్ని రూ.1395.30 కోట్లుగా నిర్ణయించారు. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడిని తట్టుకోలేక అధికారులు గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆ పనుల అంతర్గత అంచనా వ్యయాన్ని రూ.1483.23 కోట్లకు పెంచుతూ ఈ - ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో టెండర్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేశారు. 14 రోజుల్లోనే అంచనా వ్యయం రూ.87.93 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది.

  24 గంటల్లో మారిన స్వరం.. కేంద్రంపై విమర్శలొద్దని సొంత నేతలకు బాబు హితవు

  24 గంటల్లో మారిన స్వరం.. కేంద్రంపై విమర్శలొద్దని సొంత నేతలకు బాబు హితవు

  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కాంట్రాక్టర్లు అదనపు పని చేశామని చెబితే అందుకు అనుగుణంగా అదనపు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. అంటే.. అంచనా వ్యయం భారీగా పెరుగుతుంది. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు రెండు నాలుకల ధోరణి మరోసారి బయటపడింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై శివాలెత్తి 24 గంటలు గడవక ముందే శుక్రవారం ఆయన స్వరం మార్చారు. గురువారం పోలవరం ప్రాజెక్టు పై ప్రకటన సమయంలో కేంద్రానికి ఓ నమస్కారమని ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రంపై, బీజేపీ నేతలపై ఎటువంటి విమర్శలు చేయవద్దని, సంయమనం పాటించాలని నేతలకు హుకుం జారీ చేశారు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేస్తే అధికారం సుదీర్ఘంగా ఉంటుందని తమ పార్టీ ఎమ్మెల్యేలకు టీడీఎల్పీ సమావేశంలో శుక్రవారం సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాజా పరిణామాలపై కేంద్ర ప్రభుత్వంపైగానీ, బీజేపీపైగానీ ఎలాంటి విమర్శలు చేయవద్దని దిశానిర్దేశం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP CM Chandrababu played so many roles with in 24 hours on Polavaram Project. Union Government orders AP government to stop tender process on polavaram. Another side Complition of Polavaram Project work would not complete in stipulated time while in this context AP CM Chandra Babu said that his government ready to handover the Polavaram project work to Union Government.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి