కావాలంటే ఒప్పించాలి: ఎపి, టిపై చంద్రబాబు లాజిక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తమిళనాడు రాజధాని చెన్నైకి బయలుదేరే ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కావాలంటే సీమాంధ్రులను ఒప్పించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథావిధంగా సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణ వారిని ఒప్పించాలని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ డైరెక్షన్లో తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జగన్, కెసిఆర్ నాటకాలు అన్నీ 10 జన్‌పథ్ స్క్రిప్ట్ ప్రకారమేనన్నారు. కిరణ్‌ను అధిష్టానమే ప్రోత్సహిస్తోందన్నారు. ప్రతిపక్ష నేతగా తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం, సభాపతి పైన ఉందని కానీ, తనకు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు.

తాను మాట్లాడుతానన్న రోజే ముఖ్యమత్రి మాట్లాడారని, విభజనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేస్తోందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం సీమాంధ్రలో క్రమంగా తగ్గుతున్నందునే కాంగ్రెసు పార్టీ అధిష్టానం కిరణ్ బలం పెంచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. విభజనలో భాగస్వామ్యం ఉన్న కిరణ్ సమైక్య హీరో ఎలా అవుతారో చెప్పాలని ప్రశ్నించారు. పాలన చేతకాకుంటే తమకు వదిలేయాలని సవాల్ విసిరారు.
కొత్త ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రం చేసేది భౌగోళిక విభజన కాదని ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని వ్యతిరేకిస్తున్నానని చెబుతూనే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన ఈగ కూడా వాలనీయడం లేదన్నారు. విభజన తీరు సరిగా లేదని, తాను రాష్ట్రపతి, జాతీయ నాయకులను కలుస్తానని చెప్పారు. కాంగ్రెసు నాటకాలను వారికి వివరిస్తానన్నారు.
371డిని సవరించకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. విభజన ప్రక్రియలో కాంగ్రెసు పార్టీ అడుగడుగునా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందన్నారు. తెలుగు జాతికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినట్లు చెప్పడం విడ్డూరమని, రాష్ట్రపతి ఒప్పుకోనందున మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారని చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగిసిందని ప్రకటించి ముఖ్యమంత్రి తీర్మానం పెట్టడం కుట్ర అన్నారు.
రాష్ట్రాన్ని కలిపి ఉంచాలంటే తెలంగాణ వారి అభిప్రాయం, తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్రుల అభిప్రాయం కావాల్సిందే అన్నారు. తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి చెబుతానని తెలిపారు. అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. విభజన విషయంలో పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications