Chandrababu: ఇంటికెళ్లి పెన్షన్ ఇచ్చి..వాళ్ల ఆటోలోనే సభకు చంద్రబాబు..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రతీ నెలా ఠంచనుగా పెన్షన్ల పంపిణీకి రాష్ట్రంలో ఏదో ఒక చోటికి వెళ్లి నేరుగా కలుస్తున్న సీఎం చంద్రబాబు ఇవాళ జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామానికి వెళ్లారు. అక్కడ ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను అందజేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు.
అలాగే ఆమె పెద్దకుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత మగ్గాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. 1వ తరగతి చదువుతున్న తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్థన్‌కు తల్లికి వందనం కింద లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ సీఎంకు తెలిపారు. అనంతరం అలివేలమ్మ చిన్నకుమారుడు ఆటోడ్రైవర్ జగదీష్‌తో సీఎం మాట్లాడారు. ఆయన ఆటోలోనే సీఎం చంద్రబాబు వేదిక వరకు ప్రయాణించారు. ప్రయాణం సమయంలో వారి కుటుంబ ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు.


అనంతరం ప్రజా వేదిక వద్దకు వచ్చి బహిరంగసభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా ఎమ్మెల్యేపైనా దూషణలకు దిగుతున్నారని వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, ఖండించాలని జగన్ కు సూచించారు. నాయకుడే రెచ్చగొడితే ఇక కిందిస్థాయి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడతారన్నారు.

ఎవరు, ఎక్కడ ఆందోళన చేసినా వెంటనే చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతిచోట డ్రోన్లు పర్యవేక్షిస్తున్నాయిని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వివేకా హత్య జరిగితే తమపై విషం చిమ్మారని, అనేక మాటలు మారుస్తూ తనపై అభాండాలు వేశారని, వారి పత్రికలో తనపై అసత్యాలు రాశారన్నారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామని, దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం మనదేని చంద్రబాబు తెలిపారు. పేదవాళ్లకు సాయం చేస్తే కలిగే తృప్తి మరే దాంట్లోనూ రాదన్నారు. కడప స్టీల్‌ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని, 2028 డిసెంబర్ నాటికి స్టీల్‌ప్లాంట్ తొలిదశ పనులు పూర్తవ్వాలని తెలిపారు. కడప స్టీల్‌ప్లాంట్ వస్తే జమ్మలమడుగు ప్రాంతం అభివృద్ధి అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications