చంద్రబాబుకు సరికొత్త సవాళ్లు: పవన్ కళ్యాణ్ కాపాడుతారా?

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయించడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైచేయి సాధించినట్లు అనిపించారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సయోధ్య కుదరడం కూడా ఆయనకు కలిసి వస్తుందని భావించారు. కానీ, ఆయన తాజాగా సరికొత్త సవాళ్లను ఎదుర్కుంటున్నారు. ఓ వైపు కాపు స్వరాలతో పాటు ప్రాంతీయ స్వరాలు కూడా పెరుగుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడ్పాటుతో కోస్తాంధ్రలోని ఇరు సామాజిక వర్గాల మధ్య సయోధ్యను సాధించి, ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి తీవ్రమైన సవాల్ ఎదురవుతోంది. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

కాపు సామాజిక వర్గానికి బిజెపి స్వరం కూడా తోడు కావడం అదనంగా చంద్రబాబుకు చిక్కులు తెచ్చిపెడుతోంది. రాజకీయంగా తెర వెనక్కి వెళ్లారని భావిస్తున్న బలమైన కాపు సామాజిక వర్గం నాయకుడు ముద్రగడ పద్మనాభం తెర మీదికి వచ్చారు. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా హత్యోదంతాన్ని సమర్థంగా వాడుకుని చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని కాపు రాజకీయ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. బిజెపిలో చేరిన కన్నా లక్ష్మినారాయణ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడడం అందుకు సంకేతంగా చెప్పవచ్చు.

Chandrababu faces new challenges in AP

ఇదే సమయంలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆత్మకథను మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆవిష్కరించడం వెనక కూడా రాజకీయం ఉండవచ్చుననే ప్రచారం సాగుతోంది. వంగవీటి రంగా హత్య వెనక చంద్రబాబు హస్తం ఉందని హరిరామ జోగయ్య ఆ పుస్తకంలో ఆరోపించారు. అలాంటి వ్యాఖ్యలు ఉన్న పుస్తకాన్ని పురంధేశ్వరి ఆవిష్కరించడం కూడా చర్చనీయాంశంగానే మారింది.

పురంధేశ్వరి పేరును ప్రస్తావించకుండా పుస్తకావిష్కరణకు వెళ్లినవారికి అందులో ఉన్న విషయాలేమిటో తెలిసి ఉండకపోవచ్చునని టిడిపి నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. పురంధేశ్వరి ఎన్టీ రామారావు కూతురు కావడంతో ఆయన అంతకు మించి వ్యాఖ్యానించడానికి సాహసించలేదని అనుకోవాల్సి ఉంటుంది. అయితే, పురంధేశ్వరి దాన్ని ఆవిష్కరించడంలో బిజెపి కోణం ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. టిడిపి బలం తగ్గుతోందని బిజెపి నేత కావూరి సాంబశివరావు వంటివారు వ్యాఖ్యానించడం ఆ చర్చకు మరింత ఊతం ఇస్తోంది.

కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఒక్కటై చంద్రబాబును ఎదుర్కునే రాజకీయాలకు చెక్ పెట్టడానికి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలిసి వస్తారా అనేది ఇప్పుడున్న ఉత్పన్నమవుతున్న ప్రశ్న. తన ఆత్మకథలో హరిరామ జోగయ్య బిజెపికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్‌‍ను ప్రశంసి, కాంగ్రెసులో ఉన్న చిరంజీవిని వ్యతిరేకించారు. అలాగే, దాసరి నారాయణ రావుపై కూడా ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. దీని వెనక మతలబు ఏమిటనేది కూడా చర్చనీయాంశంగానే మారింది.

Chandrababu faces new challenges in AP

నిజానికి, పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగానే కోస్తాంధ్రలో రెండు ఆధిపత్య సామాజిక వర్గాలు ఒక్కటి కావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓడిపోయి, తెలుగుదేశం పార్టీ గెలిచిందనే అంచనా ఉంది. ఈ రెండు సామాజిక వర్గాల సయోధ్య కొనసాగితేనే చంద్రబాబుకు ఊరట లభిస్తుంది. కానీ, అది బీటలు వారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ ఎటు ఉంటారనేది కూడా చర్చనీయాంశంగానే మారింది.

ఇదిలావుంటే, రాజధాని ప్రాంతం నిర్ణయంతో, దాని శంకుస్థాపనతో రాయలసీమలో ప్రాంతీయ స్వరం పెరుగుతోంది. రాయలసీమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే, ఉత్తరాంధ్రను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు చంద్రబాబుపై వస్తున్నాయి. ఈ విమర్శల వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టిపారేసే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాంతీయ రాజకీయాలు మొగ్గ తొడుగుతున్న సంకేతాలు లేవని మాత్రం చెప్పలేం.

రాయలసీమ, ఉత్తరాంధ్రలకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మంగళవారంనాడు విమర్శించారు. ఈ విమర్శ వెనక ఆయన ఆంతర్యం ఏదైనా ఉందా అనేది కూడా ఆలోచించాలని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి బహిరంగంగానే ప్రాంతీయ వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+