నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబం సంక్రాంతి సందడి ఇలా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందడి కనిపిస్తుంది. తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఏపీ ప్రజలు అత్యంత ఘనంగా సంక్రాన్తిన్ పండుగను జరుపుకుంటున్నారు. నిన్న జగన్ ఏపీలో అధికారికంగా సంక్రాంతి సంబరాలలో పాల్గొనగా, చంద్రబాబు మాత్రం తమ కుటుంబంతో నారావారి పల్లెలో సందడి చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలలో పాల్గొంటున్నారు. చంద్రబాబు ఆయన స్వగ్రామమైన నారావారిపల్లెలో అక్కడ గ్రామస్థులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం చంద్రబాబు సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి స్వగ్రామానికి రావడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.

ఈసారి చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, తన కుమారుడైన లోకేష్ తో కలిసి ఆదివారం మధ్యాహ్నం నారావారి పల్లెకు చేరుకున్నారు . చంద్రబాబు కుటుంబానికి టిడిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నిన్న మధ్యాహ్నం నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లను తొలగించాలని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తున్న రైతు దామోదర్ నాయుడుని పలకరించారు.
అనంతరం గ్రామస్తుల ఆత్మీయ పలకరింపులతో, వారితో ఫోటోలు దిగుతూ గడిపారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులకు, బంధువులకు, గ్రామస్తులకు తన ఇంట్లో విందు ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇక నేటి సంక్రాంతి పర్వదినం సందర్భంగా నారావారిపల్లెలో ప్రత్యేక పూజలలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది.
నారా, నందమూరి కుటుంబసభ్యులు సోమవారం గ్రామ దేవత గంగమ్మకు, తమ కులదైవం నాగాలమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారాలోకేష్, మనవుడు దేవాన్ష్ తో కలిసి కులదేవత నాగాలమ్మకు కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కులు చెల్లించుకున్నారు.
ఆ తరువాత తన తల్లిదండ్రులైన ఖర్జూర నాయుడు, అమ్మణ్నమ్మల సమాధులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆపై గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, బాబు, లోకేష్ తిరుగు ప్రయాణం కానున్నారు.












Click it and Unblock the Notifications