జయను ఫాలోఅవుతున్న బాబు, క్యాంటీన్ల తర్వాత...
హైదరాబాద్: తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత తీసుకు వచ్చిన అమ్మ క్యాంటీన్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లు (ఎన్టీఆర్ క్యాంటీన్లు) తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. జయ మరో పథకాన్ని కూడా చంద్రబాబు ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఔషదాలు తక్కువ ధరకు దొరికేందుకు జనరిక్ మెడికల్ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం టాయిలెట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
శనివారం చంద్రబాబు జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పలు అంశాల పైన చర్చించారు. ఈ సమయంలో చంద్రబాబు.. మెడికల్, హెల్త్, విద్య తదితర అంశాల పైన తన అసంతృప్తిని తెలియజేశారట. ముఖ్యంగా మెడికల్, హెల్త్ మరీ అధ్వాన్నంగా ఉందని చెప్పారట. వీటిని బాగు చేయాలని సూచించారు.

రైతులు తమ భూములను కూడా అమ్మి పిల్లలను కష్టపడి చదివిస్తున్నారని, కానీ, ఉదాహరణకు ఐదో తరగతి పిల్లాడు అంతకు తక్కువ తరగతి ప్రతిభను కూడా కనబర్చలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యను అందించి పిల్లల ప్రతిభ వెలికితీసే దిశలో ఆలోచించాలని సూచించారు.
ప్రభుత్వం చేపట్టబోయే 'బడి పిలుస్తోంది' ద్వారా విద్యార్థులు అందరు వచ్చేలా చూడాలని సూచించారు. అలాగే పలు పథకాలను ఆధార్‌కు లింక్ చేయనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ లేకుండా చూడాలన్నారు. అలాగే విద్యార్థులకు, ముఖ్యంగా అమ్మాయిలకు టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. తమిళనాడులో 'నమ్మ లేట్రీన్స్' ఉన్నాయి. వాటిలా ఆంధ్రప్రదేశ్‌లో 'మా లేట్రన్స్'ను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. రైతుల రుణమాఫీ విషయమై కూడా చంద్రబాబు చర్చించారు.












Click it and Unblock the Notifications