మోడీ రూట్లో దూకుడు: బాబు టార్గెట్, మళ్లీ 2020
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుండే మరింత దూకుడు పెంచారు. పాలనాపరమైన లోటు పాట్ల పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఎపి పరిపాలనకు వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వివిధ శాఖల స్థితిగతులపై అయిదు శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు.
కాగా, పాలన కోసం వంద రోజులను చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రధాని మోడీ కూడా మంత్రులకు వంద రోజుల టార్గెట్ పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ పదేళ్ల పాలన వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఐటి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పారుదల రంగంలో ఫలితాలు రాకుండా చేశారని ఆరోపించారు. 19 నుండి అసెంబ్లీ సమావేశాలుంటాయన్నారు.

విభజనలో హేతుబద్ధత లేకపోవడం వల్ల అన్యాయం జరిగిందన్నారు. విద్యుత్ రంగాన్ని కాంగ్రెసు పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. కాంగ్రెసు పాలనలో రెండు రాష్ట్రాలు భ్రష్టు పట్టాయన్నారు. ప్రచారంలో తాము ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు. ఎపిలో పాలనను గాడిలో పెట్టేందుకు వంద రోజుల ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో అభివృద్ధి చేస్తామన్నారు. మూడు ఆర్థిక సంఘాల సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమతుల్యం కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధిపై ముందుకెళ్తామన్నారు. సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరెంట్ కోతతం పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఐఏఎస్‌లు తగ్గారని, శాఖలను పునర్ వ్యవస్థీకరించుకోవాలన్నారు. 45 శాఖలను 26 మందికి కేటాయించాలన్నారు. ఆ తర్వాత శాఖల కేటాయింపు ఉంటుందని చెప్పారు. విజన్ 2020 పునరుద్ధరిస్తామన్నారు.
ఎక్స్‌గ్రేషియా
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.












Click it and Unblock the Notifications