ఏపీలో వారికి ఉచిత బైక్ లు ఇస్తున్న చంద్రబాబు.. ధర లక్ష రూపాయలపైనే!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంపైన కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలో వారికి ఉచితంగా త్రిచక్ర వాహనాలను అందజేయాలని నిర్ణయించింది. హీరో కంపెనీకి చెందిన 125 సిసి సామర్థ్యంగల మోటార్ వాహనాలను దివ్యాంగులకు అందించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. దివ్యాంగులకు అందించనున్న ఈ వాహనాల విలువ రూ.1.07లక్షలు కాగా, ప్రభుత్వం వీటిని 100% రాయితీతో అందించనుంది.
త్వరలో లబ్ధిదారుల ఎంపిక
ఈ త్రిచక్ర వాహనాల సరఫరాకు సంబంధించిన టెండర్లు పూర్తికాగా, విజయవాడకు చెందిన ఆర్ ఎం మోటార్ సంస్థకు ఈ టెండర్లు దక్కాయి. బిడ్ ఫైనలైజ్ కమిటీ ఆమోదం పొందిన రెండు వారాలలో ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుంది. ఈ పథకం అందించడానికి దివ్యాంగుల సంక్షేమ శాఖ దరఖాస్తులను తీసుకుంటుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 1750 మందికి వాహనాలను ఇవ్వనున్న సర్కార్
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పది మంది చొప్పున మొత్తం 1750 మందికి 2025-26 సంవత్సరానికి గాను వాహనాలను అందించాలని ప్రణాళికను రూపొందించారు. ప్రస్తుతం మొదటి దశలో 875 మందికి వాహనాలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ప్రభుత్వం 9.4 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశ లబ్ధిదారులకు కూడా వాహనాలను అందిస్తారు.
పథకంలో బైక్ పొందటానికి అర్హతలు ఇవే
ఈ పథకం అమలు చేయడానికి లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఈ నిబంధనలను కచ్చితంగా చూస్తారు. డిగ్రీ ఆపై చదువుతున్న విద్యార్థులు, స్వయం ఉపాధి రంగంలో కనీసం ఏడాదికి పైగా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు.దరఖాస్తుదారులు 18సంవత్సరాల వయసు నుంచి 45 ఏళ్ల వయసు మధ్య వారై ఉండాలి. వీరి వార్షికాదాయం మూడు లక్షల రూపాయల లోపు ఉండాలి. 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
లబ్ది పొందాలంటే ఇలా చెయ్యాల్సిందే
ఈ పథకంలో లబ్ధి పొందాలంటే ముఖ్యంగా వారికి సొంత వాహనం ఉండకూడదు. గతంలో ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఇటువంటి వాహనాలను పొంది ఉండకూడదు. అయితే గతంలో దరఖాస్తు చేసుకొని వాహనం మంజూరు కానివారు తిరిగి ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద త్రిచక్ర వాహనం పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన సదరం ధ్రువ పత్రాన్ని దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా పెట్టాలి.
దరఖాస్తులకు ఈ ధృవ పత్రాలు కంపల్సరీ
సదరం సర్టిఫికెట్ తో పాటు ఎస్ఎస్సి ధ్రువీకరణ పత్రాన్ని, ఆధార్ కార్డును, ఎస్సీ, ఎస్టీలు అయితే కుల దృవీకరణ పత్రాన్ని, పాస్పోర్ట్ సైజు దివ్యాంగుల పూర్తి ఫోటోలు, 2022 జనవరి ఒకటవ తేదీ తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని, ఇక చదువుకుంటున్న విద్యార్థులైతే బోనఫైడ్ సర్టిఫికెట్ ను దరఖాస్తుతో పాటు సమర్పించాలి.
అర్హత ఉంటే వీరికి బైక్స్
అంతేకాదు గతంలో ఎటువంటి వాహనాలు తీసుకోలేదని, తాను సమర్పించిన వివరాలన్నీ సరైనవేనని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అన్ని విధాల అర్హత ఉన్నవారికి త్రిచక్ర వాహనాలను కేటాయిస్తారు.












Click it and Unblock the Notifications