ముద్రగడ నన్ను డిక్టేట్ చేస్తారా, కేసులు వేయండి: జగన్‌పై బాబుకు కోపమొచ్చింది
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఏపీ కేబినెట్ సమావేశంలో ముద్రగడ లేఖ పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది.
ముద్రగడ లేఖ, రాసిన తీరు పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు తీరకుండానే మళ్లీ డెడ్ లైన్ పెట్టడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. ముద్రగడ ఆ లేఖను వైసిపి అధినేత జగన్ కోసం రాసినట్లుందన్నారు. భాష ఏమాత్రం సరిగా లేదని అభిప్రాయపడ్డారు.
కాపుల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చంద్రబాబు కేబినెట్ సమావేశంలో అన్నారు. ప్రభుత్వాన్ని ముద్రగడ డిక్టేట్ చేయలేదని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అదే సమయంలో కేబినెట్లో మందకృష్ణ మాదిగ తీరు పైనా చర్చ జరిగింది. వాళ్లు చెప్పినట్లు ప్రభుత్వం నడుచుకోదని చంద్రబాబు అన్నారు.

కాపులకు నిధుల కేటాయింపు, రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని మంత్రులకు సూచించారు. అలాగే, సాక్షిలో వచ్చిన బినామీ కథనాల పైన, వైసిపి నేతల ఆరోపణల పైన ఘాటుగా స్పందించారు.
నాకు బినామీలా
పారదర్శకంగా ఉండే తనకు బినామీలు ఏమిటని చంద్రబాబు కేబినెట్లో ప్రశ్నించారు. తనలా ఆస్తులను ప్రకటించిన నేతలు ఎవరైనా ఉన్నారా అని నిలదీశారు. జగన్‌కు ధైర్యం ఉంటే ఆశ్తులు ప్రకటించాలన్నారు. వైసిపి, సాక్షి పత్రికలు ఏయే టిడిపి నేతలపై ఆరోపణలు చేశారో వారు కేసులు వేయాల్సిన అవసరముందన్నారు. వారి వ్యాఖ్యల పైన చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయంగా వెళ్దామని చెప్పారు.
గంటాకు క్లాస్
సి రామచంద్రయ్య వ్యాఖ్యల పైన మంత్రి గంటా శ్రీనివాస రావు ఎందుకు స్పందించలేదని చంద్రబాబు ఆయనకు క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదని ఒకింత కోపగించుకున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్లో పలు అంశాలపై చర్చ జరిగింది.
కాగా, సాక్షిలో వచ్చిన భూదందా కథనాలపై వైసిపి, కాంగ్రెస్ విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో ముద్రగడ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడడం లేదని ఆరోపించారు. ఇలా ముప్పేట దాడి నేపథ్యంలో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.












Click it and Unblock the Notifications