అనుభవజ్ఞులు, మీరే సర్దుకుపోవాలి: చంద్రబాబుకు ప్రణబ్ సూచన
హైదరాబాద్: వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం రెండు పర్యాయాలు కలిశారు. ఈ సందర్భంగా తాజా రాష్ట్ర, రాజకీయ పరిణామాలపై పలు ఆసక్తికర సంభాషణలు జరిగినట్లు తెలుస్తోంది. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి.. రాజకీయ అనుభవజ్ఞులైన మీరే ఓపికతో సర్దుకుపోవాలని చంద్రబాబుకు రాష్ట్రపతి సూచించినట్లు తెలిసింది.
ఇరు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్రం మధ్య వర్తిత్వం వహించి, ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడితే కొంత ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించగా.. రాష్ట్రపతి అది మంచి పనే అని అన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన ఇటువంటి సమస్యలతో కూడి ఉంటుందని తనకు తెలుసునని, విభజన చట్టం తయారు చేసే సమయంలో మరికొంత కసరత్తు జరిగి ఉంటే బాగుండేదని రాష్ట్రపతి అభిప్రాయపడినట్లు తెలిసింది.

సమస్యలు వస్తున్నా.. ఉద్రిక్తతలకు తావు ఇవ్వకుండా రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని చంద్రబాబుకు రాష్ట్రపతి ప్రణబ్ సూచించినట్లు సమాచారం. ప్రణబ్‌తో చంద్రబాబు చర్చించిన సమయంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా ఉన్నారు.
కాగా, రాష్ట్రపతికి ఇచ్చిన విందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ కూడా హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన విందుకు హాజరు కాలేదు. దీంతో తెలంగాణ సిఎంకు కేటాయించాల్సిన సమయాన్ని కూడా చంద్రబాబుతో మాట్లాడేందుకు రాష్ట్రపతి కేటాయించాల్సి వచ్చింది.

కెసిఆర్ కూడా ఈ విందుకు వస్తే బాగుండేదని చంద్రబాబు రాష్ట్రపతితో అన్నట్లు తెలిసింది. మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించాలని భావించినట్లు చంద్రబాబు తెలిపినట్లు సమాచారం. గతంలో కృష్ణా జలాల విడుదల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసిన సమయంలో తానే చొరవ తీసుకుని తెలంగాణ సిఎంకు ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించానని తెలిపినట్లు తెలిసింది. ఆ తర్వాత గవర్నర్ వద్ద చర్చతో తమ సమస్యకు పరిష్కారం లభించిందని చెప్పినట్లు తెలిసింది.
విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించుకోకపోవడం వల్లే ఇప్పటికీ అవి సమస్యలుగానే ఉన్నాయని చంద్రబాబు రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో చర్చించనట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications