బాబు30: దూకుడు తగ్గి, టిపై ఒత్తిడి, రాజధాని ట్విస్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నెల రోజులు పూర్తి చేసుకున్నారు. పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతంలో మాదిరిగా దూకుడును ప్రదర్శించకుండా.. అనుభవాన్ని రంగరించి పాలన సాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. విభజన నేపథ్యంలో ఏపీకి చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని ప్రణాళికాబద్దంగా పరిష్కరించే పనిలో చంద్రబాబు ఉన్నారు.
ఇప్పటి వరకు వ్యవస్థల సర్దుబాట్లకే సమయం పట్టిందంటున్నారు. ఓ వైపు సర్దుబాటు ప్రయత్నాలు చేస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీల పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. సమస్యల పైన ప్రజల అవగాహనకు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. విభజన నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన ఉన్నతాధికారుల కేటాయింపులు జరగకపోయి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ తన అనుభవంతో స్థిర నిర్ణయాలు తీసుకోగల్గుతున్నారు.
చంద్రబాబు ఏపీకి 24 గంటల విద్యుత్ సరఫరా దిశగా నిర్దిష్టమైన చర్యలు, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచడం, కేంద్రం ఏర్పాటు చేయబోయే విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల కోసం స్థలం గుర్తింపు తదితర అంశాల్లో చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలందరికీ తాగునీటిని అందించేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాల కార్యాచరణ వివిధ దశల్లో ఉంది.

కార్యాలయం లేకుండా
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రికి కార్యాలయమే తయారు కాలేదు. సగం మంది మంత్రుల కార్యాలయాలకు పూర్తిస్థాయిలో వసతులు సమకూరలేదు. అనేక శాఖల్లో అధికారులు, సిబ్బంది సర్దుబాటు పూర్తి కాలేదు. ఇటువంటి బాలారిష్టాల నడుమ చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి నెలరోజులు ముగిసింది.

లేక్ వ్యూ
ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం తయారు కావడానికే పదిహేను రోజులు పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థలను సర్దుబాటు చేసుకోవడానికే చంద్రబాబుకు మొదటి నెల రోజుల పాలనలో అధిక శాతం సమయం సరిపోయింది.

దూకుడు తగ్గించి...
నిధులు లేక, కనీసం రాజధాని ఏదో కూడా తేలకుండా తుక్కు మాదిరిగా చేతికి వచ్చిన రాష్ట్రానికి కొత్త రూపు ఇచ్చేందుకు బాబు అడుగులు వేస్తున్నారు. తాను పరుగులు తీస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించడం... కొత్త కొత్త ఆలోచనలు, నిర్ణయాలతో అందరినీ ఆకట్టుకోవడం సహజంగా చంద్రబాబు శైలి. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు శైలిని మార్చారు. దూకుడు తగ్గించి అనుభవాన్ని రంగరించి ముందుకు పోతున్నారు.

ఉద్యోగుల విరమణ వయస్సు పెంపుతో కేసీఆర్ పైన ఒత్తిడి పెంచి
విభజన తర్వాత అధ్వానస్ధితిలో చేతికి వచ్చిన రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడానికి... ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆయన ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి పని చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును అరవై ఏళ్లకు పెంచుతూ ఫైలు పైన సంకం చేశారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపితే పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది.

హామీలు, జగన్‌తో ఢీ
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన రైతు రుణ మాఫీని అమలు చేయడానికి చంద్రబాబు ఈ నెల రోజుల్లో సుదీర్ఘమైన కసరత్తు చేశారు. దానిపై అధ్యయనానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌ను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు పైన జగన్ కాలు దువ్వేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అవి కుదరకపోతే ఇతర మార్గాల ద్వారా రుణాలు సేకరించైనా మాఫీ హామీ నిలబెట్టుకోవడానికి బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నారు.

పీపీఏ
24 గంటలూ విద్యుత్ సరఫరాకు పైలెట్ రాష్ట్రంగా ఏపీని ఎంపిక చేయించడం, కేంద్రం నుంచి అదనపు విద్యుత్, బొగ్గు కేటాయింపులను సాధించడం వంటివి చంద్రబాబు చేయగలిగారు. ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాల్లో బెల్టు షాపులు ఎత్తివేయడం, రెండు రూపాయలకు ఇరవై లీటర్ల మినరల్ వాటర్ సరఫరా వంటి హామీల అమలుకు కార్యాచరణ మొదలు పెట్టారు. పీపీఏ విషయంలో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంతో ఢీ కొట్టారు. చంద్రబాబు పీపీఏల రద్దుపై తెలంగాణ ప్రభుత్వం నిప్పులు చెరిగింది. పీపీఏల రద్దుతో చంద్రబాబు ఏపీలో హీరో అయ్యారు!

ప్రమాదాలు
చంద్రబాబు వేగం ప్రకృతి ప్రమాదాల్లో కనిపించింది. హిమాచల్ ప్రదేశ్‌లో తెలుగు విద్యార్ధులు నదిలో కొట్టుకుపోయిన దుర్ఘటనలో హైదరాబాద్‌లో దుఖంలో ఉన్న తల్లిదండ్రులను ప్రత్యేక విమానంలో అక్కడకు తరలించడం... అక్కడ ఉన్న మిగిలిన విద్యార్థులను ఇక్కడకు తీసుకురావడంలో ఆయన చూపించిన స్పీడ్ పొరుగు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచింది. తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్ పైప్‌లైన్ పేలిన దుర్ఘటనలో ఢిల్లీ నుంచి హుటాహుటిన తరలిరావడం, వారం లోపే ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ చేయించడం, తమిళనాడులో జరిగిన ప్రమాదాల బాధితులను ఆదుకోవడానికి అధికారులు, మంత్రులను వెంటనే పంపడం వంటి నిర్ణయాలు ప్రశంసలు అందుకొన్నాయి.

మంత్రివర్గ సమావేశం
మంత్రివర్గ మొదటి సమావేశాన్ని విశాఖలో పెట్టిన ఆయన ఈసారి స్వాతంత్య్ర వేడుకలను కర్నూలులో పెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు.

శ్వేతపత్రం
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై శ్వేత పత్రాల విడుదలను మొదలు పెట్టారు. విభజన నేపథ్యంలో సర్దుబాటుకే ఇంత సమయం పట్టిందని, పూర్తి సర్దుబాటుకు మరో మూడు నెలలు పట్టవచ్చునంటున్నారు.

రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన సస్పెన్స్ కొనసాగుతోంది. విజయవాడ - గుంటూరుల మధ్య రాజధాని బాగుంటుందని చంద్రబాబు సహా మంత్రివర్గంలోని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అమరావతి కేంద్రంగా కూడా వాదన వినిపిస్తోంది. రాయలసీమ రాజధాని కమిటీ మాత్రం కర్నూలును రాజధాని చేయాలని డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications