ట్రాఫిక్ ఆపొద్దు: ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి ఢిల్లీ బయల్దేరారు. అయితే, తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపవద్దని బుధవారం ఆయన అధికారులకు స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలను ఆయన భద్రతా సిబ్బంది గుంటూరు, విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లే ముందు పోలీసులు మరోసారి ట్రాఫిక్ ఆపారు. దీంతో పోలీసుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సేవకులుగా పోలీసులు మారాలంటూ చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటలతరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలని చంద్రబాబు నిర్ణయించారు. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి రావాలని తన సీఎస్ఓను ఆదేశించారు.

ఉండవల్లి నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లేలోపులోనే గుంటూరు ఎస్పీ, విజయవాడ సీపీలకు చంద్రబాబు సీఎస్ఓ మరోసారి సమాచారం ఇచ్చారు. భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూడాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి పోకడలకు ఇక స్వస్తి చెప్పాలని కాబోయే సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కాగా, చంద్రబాబుతోపాటు టీడీపీ ఎంపీలు కూడా ఢిల్లీ బయల్దేరారు. శుక్రవారం ఎన్డీఏ పక్షాల భేటీకి ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొననున్నారు. ఆ తర్వాత ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరుకానున్నారు.
కాగా, గురువారం మధ్యాహ్నం ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలిచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని.. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications