జాతీయ రహదారి 16పైన శుభవార్త చెప్పిన చంద్రబాబు..వారికి జర్నీ పండుగే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోడ్డు రవాణా, రైల్వే, గగనతల రవాణా ఇలా అన్నింటిలోనూ దూసుకుపోతోంది. మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యాలు ఉంటే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతాయని భావించిన ఏపీ సర్కార్ రహదారుల నిర్మాణంపైన ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా జాతీయ రహదారులను మరింత మెరుగుపరిచేందుకు, విస్తరించేందుకు కేంద్రం సహాయం తీసుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల విస్తరణ, నిర్మాణం మరియు అభివృద్ధికి వేలకోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ, అనేక చర్యలను చేపడుతున్నాయి.
జాతీయ రహదారి 16 పైన శుభవార్త
ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం జాతీయ రహదారి 16 పైన శుభవార్త చెప్పింది. ఈ ఎన్ హెచ్ 16 ను ఆరు వరుసలుగా విస్తరించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్ చెరువు నుండి అనకాపల్లి వరకు ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

దివాన్ చెరువు నుండి అనకాపల్లి మధ్య ఆరు వరుసల రహదారి విస్తరణ
ఈ విస్తరణ ప్రయాణాలను సులభతరం చేయడమే కాకుండా, పారిశ్రామిక ప్రగతికి కూడా దోహదం చేస్తుందని భావిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వరకు ఇప్పటికే ఆరు వరుసల రహదారి ఉండగా, దివాన్ చెరువు నుండి అనకాపల్లి మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల రహదారి ఉంది. ఇప్పుడు ఈ రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరించనున్నారు.
గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పై వంతెనలు, అండర్ పాస్ లు
దివాన్ చెరువు నుండి తుని వరకు 92 కిలోమీటర్లు, పాయకరావుపేట నుండి అనకాపల్లి వరకు 70 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేస్తారు. ఇక ఈ రహదారి విస్తరణతో గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పై వంతెనలు, అండర్ పాసులు నిర్మిస్తారు. పాయకరావుపేట, కసింకోట, అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాలలో అభివృద్ధి పైన అంచనాలను సిద్ధం చేశారు.
ఆ మార్గంలో బైపాస్ లు, సర్వీస్ రోడ్లు
నక్కపల్లి మండలంలోని ఒడ్డిమెట్ట నుండి మంగవరం మీదుగా తుని శివారు వరకు బైపాస్ రోడ్డును నిర్మించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆరు వరుసలుగా విస్తరించే రోడ్డును కాకినాడ జిల్లా తుని మండలంలోని ఎర్ర కోనేరు వద్ద ప్రస్తుతం ఉన్న రహదారికి అనుసంధానం చేయనున్నారు. అలాగే నక్కపల్లి మండలంలో కూడా ఆరు రహదారుల నిర్మాణంపైన కసరత్తు చేస్తున్న అధికారులు ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయనున్నారు.
త్వరలోనే మొదలుకానున్న భూసేకరణ ప్రక్రియ
ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నారు. ముఖ్యంగా నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ పరిశ్రమలు, మిట్టల్ స్టీల్ కర్మాగారం రానున్న నేపథ్యంలో మెరుగైన రహదారులు ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications