ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే..! చెప్పేసిన చంద్రబాబు...
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీయే కూటమి జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ఉమ్మడిగా తొలి సభ నిర్వహించిన కూటమి.. త్వరలో మరిన్ని సభలకు ప్లాన్ చేస్తోంది. అంతకు ముందే కూటమిలోని అభ్యర్ధులందరినీ పిలిపించి ఇవాళ విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వారికి చంద్రబాబుతో పాటు జనసేన, బీజేపీ నేతలూ దిశానిర్దేశం చేశారు.
ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఎన్ని సీట్లు గెల్చుకోనుందో చెప్పేశారు. ఇప్పటివరకూ తాము చేయించిన సర్వేల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పార్టీలు అసెంబ్లీలోని మొత్తం 175 స్ధానాలకు గానూ.. 160 సీట్లు కైవసం చేసుకోబోతున్నారని చంద్రబాబు వెల్లడించారు. అలాగే కేంద్రంలో ఎన్డీయే కూటమి 400కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని కడప సీటుతో సహా అన్ని ఎంపీ సీట్లూ గెలుస్తున్నామన్నారు.

రాష్ట్రంలో అభ్యర్ధుల ఎంపికలో అవకాశం దక్కని 31 మందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పదవులు వచ్చేలా చూస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే పదవులు త్యాగం చేసిన నేతల త్యాగాలను మర్చిపోబోమన్నారు. మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత అభ్యర్ధుల్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేశామని, ముఖ్యంగా గెలుపు ఆధారంగానే ఈ ఎంపికలు చేసినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ పార్టీ, ఈ పార్టీ అభ్యర్ధి అని చూడకుండా ఎన్డీయే అభ్యర్ధులందరి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications