ఐపీఎస్ పీఎస్సార్ కు చంద్రబాబు మార్క్ ట్రీట్మెంట్..!!
చంద్రబాబు తన మార్క్ నిర్ణయాలు మొదలు పెట్టారు. జగన్ హాయంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే వారికి సెగ తగులుతోంది. చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్ట్ చేసిన సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తాజాగా తనను కలవటానికి వచ్చిన మాజీ నిఘా చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు..కొల్లి విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
అనుమతి నిరాకరణ
ఏపీలో జగన్ హాయంలో కీలకంగా వ్యవహరించి..నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు కొత్త ప్రభుత్వంలో ట్రీట్మెంట్ మొదలైంది. జగన్ ప్రభుత్వంలో నిఘా చీఫ్ గా పని చేసిన సీనియర్ పోలీసు అధికారి పీఎస్సార్ ఆంజనేయులు పై టీడీపీ నేతలు తొలి నుంచి ఆగ్రహంగా ఉన్నారు. ఆయన టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తూ జగన్ కోసం పని చేసారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల సంఘం ఆయన పైన బదిలీ వేటు పడింది. ఇక, ఇప్పుడు ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చారు.

పీఎస్సార్ కు చేదు అనుభవం
పీఎస్సార్ ఆంజనేయులను కలిసేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. దీంతో, పీఎస్సార్ అక్కడ చంద్రబాబును కలవకుండానే వెనక్కు తిరగాల్సి వచ్చింది. అదే విధంగా స్కిల్ కేసులో చంద్రబాబు ను అరెస్ట్ చేసిన సిట్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి సైతం నేడు మర్యాదక పూర్వకంగా చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. కొల్లి రఘురామిరెడ్డికి సెక్యూరిటీ అనుమతి నిరాకరించింది. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో కీలకంగా వ్యవహరించిన కొల్లి రఘురామిరెడ్డి తీరు పైన టీడీపీ నేతలు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేసారు. నాడు ఎన్ఎస్జీ నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు తలుపు డోర్ కొట్టిన కొల్లి రఘురామిరెడ్డి తీరు పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
కీలక నిర్ణయాలు
ఎన్నికల్లో వైసీపీకి విధేయుడుగా ఉన్నాడని రఘురామిరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. తాజాగా కొల్లి రఘరామిరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేసారు. ఇప్పుడు ఈ ఇద్దరు అధికారులు చంద్రబాబును కలిసేందుకు రావటం..అందుకు నిరాకరిచంటంతో అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక..చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సమయానికి ఏపీకి కొత్త సీఎస్..నూతన డీజీపీ నియామకం జరగనుంది. ఈ రెండు పోస్లుల్లో ఎవరిని నియమించాలనే అంశంలో చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications