గుంటూరు నుండి బాబు పాలన, 'నాగార్జున'పై పరిశీలన!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గుంటూరు నుండి ఆంధ్రప్రదేశ్‌ను పాలించే అవకాశముందని సమాచారం. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారంలో మూడు రోజులు గుంటూరు నుంచి, నాలుగు రోజులు హైదరాబాద్ నుంచి ప్రభుత్వం నడిపేలా చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయట.
చెట్ల కింద కూర్చుని అయినా కొత్త రాజధాని నిర్మించుకుంటామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో అధికారులు సిఎం తాత్కాలిక కార్యాలయం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ నరసింహన్ కూడా దీనిపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

హైదరాబాద్‌లో లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ను సీమాంధ్ర సిఎం క్యాంప్ ఆఫీస్‌గా నిర్ణయించారు. ఇప్పుడు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో క్యాంప్ కార్యాలయం కోసం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. గుంటూరులో కొన్ని ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలించి గవర్నర్‌కు నిర్దిష్ట ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది.
సిఎం క్యాంపు కార్యాలయంతో పాటు ఆయన పేషీ అధికారుల కోసం కూడా ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి గుంటూరులో ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి కూడా అందుబాటులో ఉండేలా వారి క్యాంప్ కార్యాలయాలు సిద్ధం చేయనున్నారు.
మంగళగిరిలోని స్పెషల్ పోలీస్ బెటాలియన్ ప్రాంగణంలో డిజిపి కార్యాలయం ఏర్పాటు చేయనున్నారట. ఇప్పటికే జిల్లాకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులకు దీనికి సంబంధించి మౌఖిక ఆదేశాలు అందజేశారట. సిఎంతోపాటు ఉన్నతాధికారులకు భద్రత కల్పించే విషయమై ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వారానికి మూడు రోజులు గుంటూరులో ఉండి పాలించడం ద్వారా అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications