ప్రతిపక్ష పోకడ: బాబుపై రఘువీరా, తెరాసపై పొన్నాల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా ఇంకా ప్రతిపక్ష పోకడలు వీడటం లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి బుధవారం ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆత్మన్యూనతా భావనలో ఉన్నారని ఆయన విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని తొలి బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందన్నారు. రుణాల రీషెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ రైతులకు పెను భారమేనని చెప్పారు. చంద్రబాబు కాలయాపన కోసమే కమిటీలు, కథలు అంటూ చెబుతున్నారని విమర్శించారు. రుణాలు రీషెడ్యూల్ చేస్తే కొత్త రుణాలకు బ్యాంకుల వద్ద నిధులు ఉన్నాయా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వంపై పొన్నాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన తెలంగాణ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస నెల రోజుల పాలన అయోమయం, గందరగోళమన్నారు. భూముల స్వాధీనం పేరుతో ప్రాధాన్యతాంశాలను తెరాస ప్రభుత్వం వదిలి వేసిందన్నారు.
రైతుబంధు పథకం ప్రారంభించిన హరీష్
త్వరలో రైతుబంధు పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ పథకం ద్వారా రైతులకు 6 నెలల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. మార్టిగేజ్ లేకుండానే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాన్ని ఇస్తామన్నారు. మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని, మార్కెట్ యార్డుల్లో ఈ-టెండరింగ్, ఈ-మార్కెటింగ్ విధానాలను ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications