అసెంబ్లీ: వైయస్ జగన్ కట్టడికి చంద్రబాబు వ్యూహం
హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని శాసనసభలో కట్టడి చేయడానికి తెలుగుదేశం పార్టీ పక్కా వ్యూహరచన చేసినట్లు అర్థమవుతోందని అంటున్నారు. జగన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని సంఘటనలను ముందుకు తేవడం ద్వారా ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభలో పైచేయి సాధించకుండా చేసే వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.
గత కొద్ది రోజులుగా జరుగుతున్న శాసనసభా సమావేశాలను చూస్తుంటే ఆ వ్యూహం అమలవుతున్న తీరు అర్థమవుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అవినీతి ఆరోపణలను ప్రస్తావించడం ద్వారా రెచ్చగొట్టి తమ పద్మవ్యూహంలోకి లాగి ఇరకాటంలో పెట్టాలనే కొంత మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల ఆలోచనకు చంద్రబాబు తొలుత అంగీకరించలేదని అంటున్నారు.

గతంలో పదే పదే ఆరోపణలు, విమర్శలు చేయడం ద్వారా జగన్‌కు మైలేజీ ఇచ్చినట్లయిందని, ఇప్పుడు కూడా అదే అవుతుందని చంద్రబాబు పార్టీ నాయకులతో అన్నట్లు చెబుతున్నారు. అయితే, పార్టీ నాయకులు కొంత మంది నచ్చజెప్పడంతో ఆయన అంగీకరించినట్లు, అయితే దాన్ని పరిమితి మేరకే వాడాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
శాసనసభలో జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి శాసనసభ్యులు కానటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ జగన్‌ను కట్టడి చేసి ఇరకాటంలో పెట్టడానికి శాసనసభ్యులకు సలహాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి శాసనసభ్యులే కాకుండా మంత్రులు కూడా జగన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి చేస్తున్నారని అంటున్నారు.
తెలుగుదేశం వ్యూహం కారణంగా దాదాపుగా శాసనసభలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దాడి చేయలేకపోతున్నారని అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసిపి శాసనసభ్యుల అనుభవరాహిత్యాన్ని కూడా తమకు అనుగుణంగా వాడుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో వైయస్ జగన్, వైసిపి శాసనసభ్యులు మీడియా పాయింట్‌ను ప్రభుత్వంపై దాడికి వేదికగా మార్చుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications