ఫ్యామిలీతో ఎన్టీఆర్‌కు బాబు నివాళి: బాధ్యత నాదేనని..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే కాంగ్రెస్ కుట్రలో ఆ పార్టీనే కొట్టుకుపోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్ కుట్రలు ఆడియాశలయ్యాయని చెప్పారు. శనివారం ఆయన నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చిన నివాళులర్పించారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణిలు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయడు మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాతే ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభిస్తానని చెప్పారు. ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీపై ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మ గౌరవం కోసం పార్టీ పెట్టారనీ.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని ఆయన అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని, అయినా తెలుగు జాతి అభ్యున్నతికి పాటుపడతామని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి తమ బాధ్యతేనని అన్నారు. సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునాది నుంచి నిర్మిస్తామని చెప్పారు. స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని అన్నారు.
రాష్ట్రంతోపాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం శుభసూచకమని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన గోతిలో ఆ పార్టీని పడిందని అన్నారు. దేశం, రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. చంద్రబాబు నాయుడు వెంట తెలంగాణ తెలుగుదేశం నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.












Click it and Unblock the Notifications