పులస చేప, ఉలవచారులకు ప్రపంచ ప్రాచుర్యం: చంద్రబాబు
విజయవాడ: గోదావరి పులస చేప, ఆత్రేయపురం పూతరేకు, బందరు లడ్డు, తాపేశ్వరం కాజా, విజయవాడ ఉలవచారులకు అంతర్జాతీయ ప్రాచుర్యం తేవాలని అందుకు మనవైన సంప్రదాయ వంటకాలపై పరిశోధనలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వంటలు, ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
శుక్రవారం రాత్రి విజయవాడలో పర్యాటక శాఖ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. సంస్కృతి, పురావస్తు, వారసత్వ సంపద, పర్యాటకం, ఆహారం, ఆతిథ్యం తదితర విభాగాలను అనుసంధానిస్తూ ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చించారు.
జిల్లా, నగర స్థాయిల్లో పర్యాటక మండళ్ల ఏర్పాటు. పరిమిత స్థాయిలో ఉండే పర్యాటక ప్రాజెక్టులపై ఈ మండళ్లు నిర్ణయం తీసుకుంటాయని, రాజమహేంద్రవరం, అమరావతి, విశాఖలో మండళ్లు పెట్టాలని చంద్రబాబు అన్నారు.

భవానీద్వీపం, అఖండ గోదావరిలోని ద్వీపాల్లో పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భవానీద్వీపం, కృష్ణా రివర్‌ఫ్రంట్ అభివృద్ధి కోసం బృహత్‌ప్రణాళిక తయారీకి సలహాదారులను నియమించుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఏపీటీడీసీ ఆధ్వర్యంలోని 39 ప్రాజెక్టులు ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలని ఆయన అన్నారు. సాగరమాల ప్రాజెక్టు కింద కేంద్ర భాగస్వామ్యంతో రూ.164.33 కోట్ల వ్యయంతో తొమ్మిది జెట్టీల నిర్మాణానికి రాష్ట్ర వాటాగా రూ.82.15 కోట్ల మంజూరుకు సమావేశం అంగీకరించింది. విజయవాడలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాతీయ, అంతర్జాతీయ టూరిజం ప్రదర్శనలు, వేడుకల్లో భాగస్వామ్యమవుతూ రాష్ట్రంలో పలు వేడుకల నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం చేశారు.
ఉలవచారు, పులస చేప, తాపేశ్వరం కాజా, బందరు లడ్డులకు ప్రపంచ ప్రాశస్త్యం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.












Click it and Unblock the Notifications