పొరపాటున పాకిస్థాన్ లోకి ప్రవేశించిన భారత విమానం.. పాకిస్థాన్ వార్నింగ్ తో..!
భారత్- పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ట్రావెల్ బ్యాన్ అయింది. అలాగే ఇరు దేశాల గగనతలాలను కూడా మూసివేశారు. ఇటీవల పాకిస్థాన్ గగనతలంపై భారత్ విమానాలు నిషేధం గడువును మరోసారి అక్కడి ప్రభుత్వం పొడిగించింది. జూలై 24 వరకు ఈ నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా పాకిస్థాన్ గగనతలంలోకి భారత్ కు చెందిన ఎయిర్ ఇండియా విమానం ప్రవేశించినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. దిల్లీ నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా AI479 విమానం ల్యాండింగ్ సమయంలో తలెత్తిన కొన్ని పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ గగనతలంలో పొరపాటున కొద్దిసేపు ప్రవేశించిందని ఈ మేరకు అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను రెగ్యూలేటరీ అధికారులకు చేరవేసినట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ఘటనపై అంతర్గతంగా దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొంది. ఎయిర్ ఇండియాలో ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు ముఖ్యమని వెల్లడించింది. అయితే ఈ ఘటనపై మరింత సమాచారాన్ని అందించేందుకు ఎయిర్ ఇండియా నిరాకరించింది. ఇక ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా విమానం దిల్లీ నుంచి మంగళవారం రాత్రి బయల్దేరిన తర్వాత 9 గంటల 18 నిమిషాలకు అమృత్ సర్ లోని శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ కావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అయితే వెంటనే లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి వార్నింగ్ సిగ్నల్ ఆ విమానానికి వెళ్లినట్లు సమాచారం. దాంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని యూటర్న్ తిప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఆ విమానం అమృత్ సర్ లో ల్యాండింగ్ కాలేదు. ఎయిర్ ట్రాఫిక్ రద్దీ భారీగా ఉండటం కారణంగా మళ్లీ దిల్లీకి ఎయిర్ ఇండియా విమానం బయల్దేరింది. అక్కడే ల్యాండ్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మరోసారి టేకాఫ్ అయి మొత్తానికి బుధవారం తెల్లవారుజామున 2 గంటల 10 నిమిషాలకు అమృత్ సర్ లో ల్యాండ్ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇక ఈ ఘటనపై అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే విషయంపై ఓ అధికారి మాట్లాడుతూ.. పాకిస్థాన్ గగనతలంలో ఒక మైల్ లేదా అంతకంటే తక్కువ దూరమే ఎయిర్ ఇండియా విమానం వెళ్లిందని.. ఇదే సమయంలో లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో కో ఆర్డినేషన్ జరిగిందని అన్నారు. అమృత్ సర్ విమానాశ్రయంలో రద్దీ దృష్ట్యా విమానాన్ని మళ్లీ దిల్లీకి మళ్లించినట్లు తెలిపారు. అలాగే పాకిస్థాన్ కు చెందిన విమానాలు కూడా ఒక్కోసారి భారత్ గగనతలంలోకి కొద్దిదూరం వస్తుంటాయని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అంతర్గత విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications