బాల్క సుమన్ కు బిగ్ రిలీఫ్
భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ లభించింది. తెలంగాణ హైకోర్టులో ఆయనకు బిగ్ రిలీఫ్ లభించింది. సింగరేణి కేలరీస్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు అయింది. దీంతో దాదాపు 25 రోజుల కస్టడీ తర్వాత ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.
బాల్క సుమన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ జరిపింది న్యాయస్థానం. ఇరు పక్షాల వాదోపవాదాలను విన్న తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 25,000 రూపాయల వ్యక్తిగత బాండ్‌తో పాటు పూచీకత్తు సమర్పించాలని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడంతో సుమన్ తరఫు న్యాయవాదులు తక్షణమే బెయిల్ ప్రక్రియను పూర్తి చేసే ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యారు.

కిందటి నెలలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ చేసిన ప్రసంగం రాజకీయ దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు తెలిపేందుకు ప్రస్తుతం కార్మికులు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలంటే శాంతియుత మార్గాల్లో ఆందోళనలు చేస్తే సరిపోదని, మిలిటెంట్ తరహా దాడులకు దిగాలని సుమన్ పిలుపునిచ్చారు.
అంతేకాకుండా రోడ్ల మీదకు వచ్చి భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాలని, సింగరేణి ప్రధాన కార్యాలయాల అద్దాలను ధ్వంసం చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పెద్ద ఎత్తున అల్లర్లను ప్రోత్సహించేలా ఉందనే విమర్శలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సమాజంలో అలజడి రేకెత్తించేలా ఉద్యోగులు, ప్రజలను హింసకు ప్రేరేపించేలా ఈ ప్రసంగం ఉందంటూ కాంగ్రెస్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
దీంతో పోలీసులు సుమన్‌పై దేశద్రోహం కేసుతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల ఆధారంగా కిందటి నెల 29న పోలీసులు బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం స్థానిక న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయనకు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత 25 రోజులుగా జైలులోనే ఉన్న సుమన్ విడుదల కోసం బీఆర్ఎస్ లీగల్ వింగ్ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా బెయిల్ మంజూరైంది.












Click it and Unblock the Notifications