పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు: నాటి తర్వాత మళ్లీ ఇప్పుడే, చర్చించిన అంశాలివే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్‌లోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నివాసానికి వెళ్లారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై వీరి భేటీలో ఇరువురు నేతలు చర్చిస్తున్నట్లు తెలిసింది. అరంగటకుపైగా వీరి సమావేశం కొనసాగుతోంది.
ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలు జరుగుతున్నాయని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఏపీలో టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల ముందు పవన్ ఇంటికి చంద్రబాబు (Chandrababu) వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అంటే దాదాపు పదేళ్ల తర్వాత ఆయన మరోసారి పవన్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలుగుదేశం మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన మినీ మేనిఫెస్టోకి జనసేన పార్టీ మరికొన్ని అంశాలు జోడించాలని ఇప్పటికే సూచించింది. మొత్తం 10 అంశాలతో టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లున్నాయి. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన అంశాల్ని జనసేన సూచించినట్లు తెలిసింది.
కాగా, ఇరు పార్టీల పొత్తు నేపథ్యంలో 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ' పేరుతో ఇప్పటికే టీడీపీ చేపట్టిన కార్యక్రమం పేరులోనూ మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ఫొటోలు ముద్రించిన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2024, మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫకేషన్ వెలవడే అవకాశం ఉండటంతో సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, బీజేపీని కూడా కలుపుకు పోవాలా? లేదా? అనే అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు-భేటీలో చర్చించిన అంశాలివే
'ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలు, ఇరు పార్టీలు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చలు సంతృప్తికరంగా సాగాయి' చంద్రబాబు-పవన్ భేటీపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వ్యూహాలు, మేనిఫెస్టోతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశాల పైన చర్చలు సాగాయి. భవిష్యత్తు కార్యాచరణ పై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ ప్రణాళిక గురించి మాట్లాడుకున్నాం. పూర్తి సమన్వయంతో వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ ను ఎలా సాధించాలి అన్నదానిపైన చర్చలు సాగాయి. ఇరు పార్టీల అధినేతల భేటీలో జరిగిన ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా మాట్లాడుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications