గుర్తుకొస్తున్నాయ్: నారావారిపల్లెలో 13న బాబు
హైదరాబాద్: గుర్తుకొస్తున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన బాల్యమిత్రులతో జ్ఞాపకాలను కలబోసుకోవడానికి సిద్ధపడ్డారు. చిన్ననాటి ముచ్చట్లను, సంఘటనలను నెమరేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ నెల 13వ తేదీన తన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె గ్రామంలో తన బాల్యమిత్రునలు ఆయన కలుసుకోబోతున్నారు.
తనతో పాటు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకున్న మిత్రులను చంద్రబాబు నారావారిపల్లెకు ఆహ్వానించారు. మీ చంద్రబాబు నాయుడు, నారావారిపల్లె అంటూ అచ్చేసిన ఆహ్వాన పత్రాలను వారికి పంపించారు. ఈ ఆహ్వాన పత్రాలను ఆయన అరవై మందికి పంపినట్లు సమాచారం. వీరిలో చాలా మంది చంద్రగిరి మండలంలోనే ఉన్నట్లు సమాచారం.

నారావారిపల్లెలోని కళ్యాణ మండపంలో చంద్రబాబు తన మిత్రులను కలుసుకుంటారు. చంద్రగిరి మండలానికి వెలుపల ఉన్నవారిని నారావారిపల్లెకు రప్పించేందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు బాల్యమిత్రులు ప్రస్తుతం వివిధ వృత్తుల్లో ఉన్నారు. వారు చంద్రబాబును కలుసుకోవడానికి ఇతోధిక ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
దశాబ్దాల తర్వాత వారు చంద్రబాబును కలుసుకోబోతున్నారు. చంద్రబాబును కలుసుకోవడానికి 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు కూడా అంతే ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications