పవన్ తో చంద్రబాబు మార్క్ రాజకీయం - కొత్త లెక్కలు, అర్దమవుతోందా ..!!
ఏపీలో పొత్తుల రాజకీయం ఆసక్తిగా మారుతోంది. బీజేపీ ముందు చంద్రబాబు తాజా ఆఫర్ ప్రతిపాదించారు. అదే సమయంలో పవన్ దూకుడుకు కట్టడి వేసే వ్యూహాలకు చంద్రబాబు పదును పెడుతున్నారు. ఎన్డీఏలో ఎంట్రీ..వారాహి యాత్రకు వచ్చిన స్పందనతో పవన్ లో పెరిగిన ధీమా..చేస్తున్న వ్యాఖ్యలతో ఒక్కసారిగా చంద్రబాబు అలర్ట్ అయ్యారు. నేరుగా రంగంలోకి దిగారు. అటు పవన్ పైన పట్టు సాధించేలా కొత్త లెక్కలు తెర మీదకు తెస్తున్నారు.
చంద్రబాబు వ్యూహాలు : టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఒంటరి పోరు అని స్పష్టం చేసిన చంద్రబాబు..పార్టీ భవిష్యత్ కు కీలకమైన ఏపీలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వేదికంగా మంత్రాంగం ప్రారంభించారు. ఇప్పటికే పవన్ తో పొత్తు దాదాపు ఖాయమైన వేళ, బీజేపీతో నేరుగా సంప్రదింపులకు ప్రయత్నించారు.

ఇప్పటి వరకు టీడీపీ, బీజేపీ మధ్య పవన్ కల్యాణ్ సంధానకర్తగా వ్యవహరించారు. కానీ, ఆశించిన ఫలితం లేకపోవటంతో చంద్రబాబు తన ప్రయత్నాలు ప్రారంభించారు. అవసరమైతే బీజేపీకి 5 లోక్ సభ స్థానాలతో పాటుగా 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్దమని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం.
పవన్ దూకుడుకు బ్రేకులు : ఇటు ఎన్డీఏలోకి ఆహ్వానం, వారాహి యాత్ర ద్వారా పవన్ లో కనిపిస్తున్న మార్పుతో చంద్రబాబు ముందస్తుగా అప్రమత్తం అవుతున్నారు. పవన్ తన పట్టు పెంచుకొని సీట్లు, అధికారం విషయంలో టీడీపీ పైన పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించారు. దీంతో, ఆ చర్చలకు ముందే పరిస్థితిని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకొనేందుకు అడుగులు వేస్తున్నారు.
టీడీపీతో తమ కంటే, తమతోనే టీడీపీకి ఎక్కువగా అవసరమనే అభిప్రాయం జనసేనలో ఉన్నట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో, బీజేపీతో నేరుగా చర్చల ద్వారా పొత్తు కొలిక్కి వస్తే, సహజంగానే పవన్ పైన పరోక్షంగా ఒత్తిడి పెరిగి, సీట్ల విషయం లో తన నిర్ణయానికి ఆమోదం తెలిపే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఆసక్తిగా పొత్తు రాజకీయం : పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో 40 సీట్ల వరకు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే, టీడీపీ జనసేనకు 15-20 మధ్య కేటాయిచేందుకు సిద్దంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ కలిసి వస్తే 15 సీట్లు ఇస్తామని ప్రతిపాదిస్తున్నట్లు చర్చ సాగుతోంది. మూడు పార్టీల పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు 30 సీట్లకు మించి ఇవ్వలేమనేది టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్న లెక్క.
ఇందు కోసమే ముందుగానే జనసేనకు ఆ విధమైన సంకేతాలు పంపితున్నట్లు తెలుస్తోంది. దీంతో, టీడీపీ చేస్తున్న పొత్తు ప్రయత్నాలకు బీజేపీ ఏమేర సానుకూలంగా స్పందిస్తుందీ.. తాను కోరుకున్నవిధంగా సీట్లు దక్కకుంటే పవన్ ఏం చేస్తారు..ఈ పొత్తు రాజకీయం ఎటువంటి మలుపులు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications