రాజీనామా: కంటతడి పెట్టిన చెరుకు సుధాకర్
హైదరాబాద్: నల్లగొండ జిల్లా నకరికేల్ శాసనసభా నియోజకవర్గానికి చెందిన చెరుకు సుధాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి రాజీనామా చేశారు. హైదరాబాదులోని ప్రెస్ క్లబ్‌లో మంగళవారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా లేఖను ఇవ్వడానికి చెరుకు సుధాకర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ భార్యతో కలిసి ఆయన తెలంగాణ తల్లికి పూలమాల వేసిన తర్వాత కంటతడి పెట్టుకున్నారు.
రాజీనామా లేఖను ఇవ్వడానికి తెలంగాణ భవన్‌కు వచ్చిన చెరుకు సుధాకర్‌ను తొలుత తెరాస కార్యకర్తలు లోనికి రానివ్వలేదు. చెరుకు సుధాకర్‌తో పాటు కొంత మంది అనుచరులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంటుందనే ఉద్దేశంతో కార్యకర్తలు ఆయనను లోనికి అనుమతించలేదు. అయితే, తాను రెచ్చగొట్టడానికి రాలేదని, రాజీనామా లేఖను ఇచ్చి వెళ్లిపోతానని చెప్పడంతో లోనికి అనుమతించారు.

తెరాసలో అవమానకరమైన పరిస్థితి ఉందని, ఉద్యమకారుల పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగానే తాను రాజీనామా చేశానని చెరుకు సుధాకర్ చెప్పారు. గెలుపు గుర్రాల పేరుతో తెలంగాణ కోసం పనిచేయని వారికి తెరాసలో పెద్ద పీట వేస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న సుధాకర్ గత కొంతకాలంగా పార్టీ అధిననేత కె. చంద్రశేఖర రావు వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమానికి ద్రోహం చేసిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌పై ఉన్న అసంతృప్తితో ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.
తాను ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తెలంగాణ ఉద్యమకారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెరుకు సుధాకర్ చెప్పారు. అయితే, నక్రికేల్ శాసనసభా నియోజకవర్గం నుంచి తన భార్యను పోటీకి దించడానికి చెరుకు సుధాకర్ రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications