తిరుపతిలో బాబు రిగ్గింగ్ చేయించారు: చింతా ఫైర్
చిత్తూరు: తిరుపతి శాసనసభ ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపి చింతా మోహన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశాలు జారీ చేసి రిగ్గింగ్ చేయించారని అన్నారు.
అధికారులు, పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్ చేయించారని ఆరోపించారు. పోలీసులు ఖాకీ చొక్కాలకు బదులు పసుపు చొక్కాలు వేసుకోవడం మంచిదని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తున్నాయని చింతామోహన్ విమర్శించారు.

తిరుపతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, టిడిపి ఎన్ని దౌర్జన్యాలు చేసినా కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా టిడిపి, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది.
బైరాగిపట్టెడలో టిడిపి, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నిరసనకు దిగారు. టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీదేవి ఆరోపించారు. సిట్టింగ్ టిడిపి ఎమ్మెల్యే వెంకటరమణ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన సతీమణి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిడిపి అభ్యర్థన మేరకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.












Click it and Unblock the Notifications