చింటూ బెంగళూర్ నుంచి కారులోనే: నోరు విప్పుతున్నాడా?, డ్రైవర్ అరెస్టు
చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ, కటారి మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ బెంగళూరు నుంచి కారులో వచ్చి చిత్తూరు చేరుకుని న్యాయస్థానంలో లొంగిపోయినట్లు గుర్తించారు. చింటూతో పాటు పారిపోయిన ఆయన డ్రైవర్ వెంకటేష్ ఆచూకీ ఇంత వరకు తెలియలేదు.
వెంకటేష్ కూడా న్యాయస్థానంలో లొంగిపోతాడనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల వద్ద పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ఈ ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే అతన్ని గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కేసులో ముఖ్యమైన వారందరినీ పోలీసులు అరెస్టు చేసినట్లయింది. చింటూ లొంగిపోవడంతో కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. కేసుతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మరి కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.

చిత్తూరుకు చెందిన మాజీ కౌన్సిలర్, ఓ కార్పోరేటర్, నీళ్ల వ్యాపారం చేసే మరో వ్యక్తి, లారీల యజమాని, ఎర్రచందనం కేసులో ఉన్న ఓ వ్యక్తి, శ్రీకాళహస్తి ట్రస్టు బోర్డులోని ఓ సభ్యుడిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. చింటూ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు గత 48 గంటలుగా వారిని విచారిస్తున్నట్లు సమాచారం.
కాగా, చిత్తూరు మేయర్ హత్య సంఘటనపై చింటూ పోలీసుల వద్ద నోరు విప్పుతున్నట్లు తెలుస్తోంది. 15 రోజుల కస్టడీకి తీసుకున్న చింటూను పోలీసులు బుధవారంనాడు చిత్తూరు నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. చింటూ చెప్పిన వివరాల ఆధారంగా కేసులో మరింత మందిని నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నవంబర్ 17వ తేదీన జరిగిన మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసులు 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఖ్య పెరగవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications