మోడీతో నాగ్ భేటీపై చిరు, టి సరికాదని కెసిఆర్ అంటారు
విజయవాడ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కలవనున్నారనే విషయంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పవన్ జనసేన, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైనా స్పందించారు.
మోడీని నాగార్జున కలవడం పెద్ద విషయం కాదని చిరు తెలిపారు. ఎవరికైనా ఎన్నో అవసరాలు ఉంటాయన్నారు. అలాంటి వారు ఎవరెవరినో కలుస్తుంటారని చెప్పారు. అభిమానంతో ఎవరు ఎవరినైనా కలువొచ్చన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు ఇంకా చాలామంది కొత్త పార్టీలు పెట్టాలన్నారు. కొత్త పార్టీలు వస్తే యువకులకు అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబు సైకిల్‌ను చూసి బుల్డోజర్ అనుకుంటున్నారని, ఎన్నికల్లో సైకిల్ తుక్కు కాక తప్పదన్నారు.

కొన్ని రోజుల తర్వాత కెసిఆర్ కూడా విభజన సరికాదని అంటారని వ్యాఖ్యానించారు. అందుకు కూడా ఓ కారణముందన్నారు. విభజన జరిగాక కెసిఆర్ కుటుంబానికి డబ్బులు ఇచ్చే వారుండరని, సమైక్యంగా ఉంటేనే వారు డబ్బులు దండుకోవచ్చునని, అందుకే విభజన సరికాదని కెసిఆర్ భవిష్యత్తులో అంటారన్నారు. డబ్బులు దండుకోవడమే కెసిఆర్ లక్ష్యమన్నారు. గవర్నర్‌కు కెసిఆర్ రాసిన లేఖ చెత్తబుట్టలో వేసేందుకు పనికి వస్తుందని చెప్పారు.
కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారబాధ్యతలు తనకు ఒక చాలెంజ్ అని చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోకి కొత్త నీరు వస్తోందని చెప్పారు. కష్టపడితేనే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. బస్సు యాత్రను నిరాశతో ప్రారంభించామని... అయితే, కార్యకర్తలు తమలో ఉత్సాహం నింపారని తెలిపారు.












Click it and Unblock the Notifications