నాడు, నేడు కాంగ్రెస్ బస్సుయాత్ర, విభజనపై చెప్పేందుకే

1994 2004 మధ్య ప్రతిపక్షంలో ఉండి తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొన్న కాంగ్రెసు అప్పట్లో పార్టీ వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో రాష్ట్ర నేతలు విస్తృతస్థాయిలో బస్సుయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి నాయకులు అంతా కలిసి ఉమ్మడిగా బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. బస్సుయాత్ర ద్వారా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపనున్నారు.
ఈ నెల 21వ తేదీ నుండి 27 వరకు సాగే యాత్రలో కేంద్రమంత్రులు, రాష్ట్ర మాజీ మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. శ్రీకాకుళం జిల్లా నుంచి బస్సుయాత్ర ప్రారంభమై అనంతపురం జిల్లాలో ముగుస్తుంది. రోజుకు రెండు జిల్లాల్లో యాత్ర సాగుతుంది. ప్రతి జిల్లాలో కార్యకర్తల సమావేశం ఉంటుంది. ఈ నెల 20న అందరు విశాఖకు చేరుకుంటారు. 21న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి బస్సుయాత్రను ప్రారంభిస్తారు.
కాగా, కార్యకర్తల్లో నెలకొన్న స్తబ్దతను తొలగించి ఉత్సాహం నింపేందుకే బస్సుయాత్ర అని చిరంజీవి అన్నారు. విభజన వెనుక ఏం జరిగింది.. దీని వెనుక ఎవరున్నారు.. దాని వెనుక లాభాలేమిటనే విషయాలపై నిజానిజాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. తెలంగాణలో వలె ఆంధ్రప్రదేశ్‌కు కార్యనిర్వాహక అధ్యక్షుడు వచ్చే అవకాశముందని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. కాగా, టిడిపి బలంగా ఉంటే వేరే పార్టీ వాళ్లను చంద్రబాబు ఎందుకు తమ పార్టీలో చేర్చుకుంటున్నారో చెప్పాలని మాజీ మంత్రి సి రామచంద్రయ్య ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications