ఆ ఇద్దరు టీడీపీ నేతలకు కీలక పదవులు, ఎట్టకేలకు వర్ల రామయ్యకు..!?
ఏపీలో రాజకీయంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాజకీయంగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ ఆసక్తి కర నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రంలో మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా నిర్ణయాలను అమలు చేస్తోంది. కూటమి పొత్తుల కారణంగా సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన.. పార్టీ కోసం సుదీర్ఘ కాలం పని చేసిన వారికి పదువుల పైన నిర్ణయాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ ఇద్దరు సీనియర్లకు కొత్త పదవుల పైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాల పైన కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి 164 మంది సభ్యుల బలం ఉంది. మండలిలో మాత్రం వైసీపీకి ఆధిక్యత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేస్తున్నారు. చేయనున్నారు. వారి స్థానంలో కూటమి నుంచి ఇద్దరి పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నమండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీకాలం పూర్తికానుంది. ఇప్పటికే జాకియా ఖానం బీజేపీకి దగ్గరయ్యారు. ఈ ఇద్దరి పదవీ కాలం ముగియటంతో ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో రెండు సీట్లు కూటమి ఖాతాలోనే జమ కానున్నాయి. అందులో భాగంగా ఈ రెండు స్థానాల భర్తీ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా వీరి ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపిక పై కసరత్తు
అందులో భాగంగా రాజ్యసభ సీటు కోసం పలు మార్లు ఆశించి.. నిరాశ చెందిన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఈ సారి ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని సమాచారం. సామాజిక సమీకరణాల్లో భాగంగా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పూర్తి కావటంతో.. ఇప్పుడు మండలికి వర్ల రామయ్యను పంపాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, రెండో స్థానం రాయలసీమ నుంచి ఎంపిక చేయనున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేత సుగవాసి ప్రసాద్ బాబుకు ఇవ్వనున్నట్లు పార్టీ నేతల సమాచారం.
2012లో రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2014, 2019, 2024 సాధారణ ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారని నాయకులు గుర్తు చేస్తున్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన ప్రసాద్ బాబుకు తగిన గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం గతంలో బహిరంగంగా హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది. కాపు-బలిజ సామాజిక వర్గానికి సీమ ప్రాంతం నుంచి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాయచోటి జిల్లా కేంద్ర హోదా కోల్పోవడం, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో ఇప్పుడు ప్రసాద బాబుకు ఇవ్వటం అవసరమని గుర్తించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పలువురు సీనియర్లు ఎమ్మెల్సీ సీట్ల కోసం రేసులో ఉన్నారు. దీంతో.. మరో రెండు రోజుల్లో ఇద్దరు కొత్త ఎమ్మెల్సీల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications